Japan Earthquake: జపాన్‌లో మళ్లీ భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Japan Earthquake Tsunami Warning Issued After Strong Quake
  • ఉత్తర జపాన్ తీరంలో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైన తీవ్రత
  • మీటరు ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరిక
  • అణు కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడి
  • కొన్ని రోజుల క్రితమే 7.5 తీవ్రతతో భూకంపం
జపాన్‌ను భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. ఉత్తర జపాన్ తీరంలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చి కనీసం 50 మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజా భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

పసిఫిక్ తీర ప్రాంతాల్లో సుమారు మీటరు (మూడు అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) కూడా భూకంప తీవ్రతను 6.7గా నిర్ధారించింది. హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రిఫెక్చర్‌లోని కుజీ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

అయితే, సోమవారం నాటి భూకంపంతో పోలిస్తే ఈసారి ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని స్థానిక మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని, అసాధారణ పరిస్థితులేవీ గమనించలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ స్పష్టం చేసింది. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రాంతంలో ఉండటం వల్ల జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011లో వచ్చిన భారీ భూకంపం, సునామీ సృష్టించిన విలయాన్ని జపాన్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
Japan Earthquake
Japan
Earthquake
Tsunami warning
JMA
Pacific Ring of Fire
Honshu Island
Iwate Prefecture
Kuji City

More Telugu News