Pakistan: పాకిస్థాన్‌పై అమెరికా మరోసారి ప్రేమ.. 686 మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందానికి ఆమోదం

US approves 686 million F16 upgrade deal for Pakistan
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌కు భారీ సైనిక సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. పాక్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణ కోసం సుమారు 686 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 5,700 కోట్లు) విలువైన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీ, విడిభాగాలు, శిక్షణ వంటివి అందించనుంది. అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (DSCA) యూఎస్ కాంగ్రెస్‌కు పంపిన లేఖను ఉటంకిస్తూ 'డాన్' పత్రిక ఈ వివరాలను వెల్లడించింది.

ఈ ప్యాకేజీలో లింక్-16 వ్యవస్థలు, క్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, ఏవియానిక్స్ అప్‌డేట్స్, సమగ్ర లాజిస్టికల్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ప్రతిపాదనపై యూఎస్ కాంగ్రెస్‌లో 30 రోజుల పాటు సమీక్ష జరగనుంది. ఈ కీలక పరిణామాలను భారత్ చాలా నిశితంగా గమనిస్తోంది. F-16 విమానాలను తయారు చేసే టెక్సాస్‌కు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఈ ప్రాజెక్టుకు ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించనుంది.

పాకిస్థాన్ F-16 విమానాల నిర్వహణ, కార్యాచరణ భద్రతను మెరుగుపరచడానికే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదని, తమ రక్షణ సన్నద్ధతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని తన లేఖలో పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికా, మిత్రపక్షాలతో కలిసి పనిచేసేందుకు పాకిస్థాన్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఆధునికీకరణతో F-16 విమానాల జీవితకాలం 2040 వరకు పెరుగుతుందని వివరించింది. 2021లోనే పాకిస్థాన్ ఈ అప్‌గ్రేడ్‌ల కోసం అభ్యర్థించినప్పటికీ, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా స్పందించలేదు. ఇప్పుడు ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Go Back to Shorts
Pakistan
F-16
America
US Congress
Military aid
Lockheed Martin
Defense deal
Terrorism
Security

More Telugu News