Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్

Pinnelli Ramakrishna Reddy and brother remanded for 14 days
  • జంట హత్యల కేసులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
  • మాచర్ల కోర్టులో హాజరుకావడంతో 14 రోజుల రిమాండ్
  • ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.

ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ6, ఏ7 నిందితులుగా చేర్చారు.

అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు తొలుత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. వారి పిటిషన్‌ను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం, రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు ముగుస్తుండటంతో వారు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. 
Pinnelli Ramakrishna Reddy
Pinnelli brothers
Macharla
Andhra Pradesh politics
TDP leaders murder case
Gundlapadu
Judicial remand
YSRCP MLA
Supreme Court
Nellore jail

More Telugu News