Chiranjeevi: మిమ్మల్ని చూస్తే రతన్ టాటా గుర్తొస్తారు: ఆనంద్ మహీంద్రాపై చిరు ప్ర‌శంస‌లు

Chiranjeevi Praises Anand Mahindra Reminds Him of Ratan Tata
  • తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో కలిసిన చిరంజీవి, ఆనంద్ మహీంద్రా
  • మెగాస్టార్ వినయానికి ముగ్ధుడినయ్యానంటూ మహీంద్రా ట్వీట్
  • ఆయన్ను కలవడం ఊహించని సర్‌ప్రైజ్ అని వ్యాఖ్య
  • మహీంద్రాను రతన్ టాటాతో పోల్చిన చిరంజీవి
హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ, ఆ తర్వాత సోషల్ మీడియాలో వారిద్దరూ ఒకరిపై ఒకరు చేసుకున్న ప్రశంసలు వైరల్‌గా మారాయి.

ఈ సమ్మిట్ అనంతరం ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా చిరంజీవితో దిగిన ఫొటోను షేర్ చేశారు. "సీఎం రేవంత్ రెడ్డితో విజన్ 2047 గురించి చర్చించాక, మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఊహించని సర్‌ప్రైజ్. ఆయన ఒక లెజెండ్. కానీ, ఆయనలోని వినయం, ప్రతీ విషయంపై చూపిన నిజమైన ఆసక్తి నన్ను మరింతగా ఆకట్టుకున్నాయి. నేర్చుకోవాలనే తపన, వినయంతో వినడమే ఏ రంగంలోనైనా శాశ్వత విజయానికి పునాది" అని మహీంద్రా తన పోస్టులో పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా ప్రశంసలపై చిరంజీవి కూడా స్పందించారు. "డియర్ ఆనంద్ మహీంద్రా గారూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం ఎందరికో ఆదర్శనీయం. మీరు చాలాసార్లు నాకు రతన్ టాటాను గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువలతో స్ఫూర్తిగా నిలిస్తే, మీరు సేవా కార్యక్రమాలలో చూపుతున్న నిబద్ధత ఎంతో మందికి ఆదర్శం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది" అని చిరంజీవి బదులిచ్చారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే, చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
Chiranjeevi
Anand Mahindra
Ratan Tata
Telangana Rising Global Summit 2025
Revanth Reddy
Manashankara Varaprasad Garu
Hyderabad
Indian Cinema
Business Leaders
Philanthropy

More Telugu News