Yashasvi Jaiswal: రోహిత్ తిట్టకపోతేనే కంగారుగా ఉంటుంది.. యశస్వి జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Yashasvi Jaiswal says he gets worried if Rohit Sharma doesnt scold him
  • రోహిత్ శర్మ తిట్లలో ప్రేమ, ఆప్యాయత ఉంటాయన్న యశస్వి జైస్వాల్
  • ఆయన తిట్టకపోతేనే ఏదో తప్పు చేశామని కంగారుపడతామని వ్యాఖ్య
  • డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్, కోహ్లీ ఉంటే ఎంతో స్ఫూర్తిదాయక‌మ‌న్న యంగ్ ప్లేయ‌ర్
  • అవకాశం వస్తే టీమిండియాకు కెప్టెన్సీ చేయడానికి సిద్ధమన్న జైస్వాల్
మైదానంలో రోహిత్ శర్మ తన జూనియర్లపై అరిచినప్పుడు అందులో కోపం కంటే ప్రేమే ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ ఆయన తిట్టకపోతేనే తమకు కంగారుగా ఉంటుందని టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తిట్లలో ఎంతో ఆప్యాయత దాగి ఉంటుందని, అది తమకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

బుధవారం జరిగిన 'అజెండా ఆజ్ తక్' సదస్సులో జైస్వాల్ మాట్లాడుతూ, "రోహిత్ భాయ్ మమ్మల్ని తిట్టిన ప్రతిసారీ అందులో చాలా ప్రేమ ఉంటుంది. నిజానికి ఆయన మమ్మల్ని తిట్టడం ఆపేస్తే... 'ఏమైంది? ఎందుకు తిట్టడం లేదు? నేను చేసిన పనికి ఆయన బాధపడ్డారా?' అని మాకు ఆందోళనగా ఉంటుంది" అని నవ్వుతూ చెప్పాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఉండటం తమలాంటి యువకులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని జైస్వాల్ తెలిపాడు. "వారు తమ అనుభవాలను పంచుకుంటారు. ఆట గురించి చర్చిస్తారు. గతంలో వారు చేసిన పొరపాట్లను మేము చేయకుండా ఎలా ఆడాలో సలహాలిస్తారు. వాళ్లు జట్టులో లేనప్పుడు మేము వారిని చాలా మిస్ అవుతాం" అని తెలిపాడు.

తన తొలి వన్డే సెంచరీ నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ, "ఆ మ్యాచ్‌లో రోహిత్ భాయ్ నన్ను ప్రశాంతంగా, కాస్త సమయం తీసుకుని ఆడమన్నారు. రిస్క్ తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అలాగే విరాట్ పాజీ చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశిస్తూ మమ్మల్ని గెలిపించాలని ప్రోత్సహించారు" అని అన్నాడు. భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది తన కల అని, అవకాశం వస్తే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జైస్వాల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
Yashasvi Jaiswal
Rohit Sharma
Indian Cricket
Virat Kohli
Team India
Cricket News
T20 World Cup
Agenda Aaj Tak

More Telugu News