Basudev Maji: జన్యు చికిత్సలో కొత్త ఆశ... వెలుగులు విరజిమ్మే ప్రొటీన్‌ను సృష్టించిన భారత శాస్త్రవేత్తలు!

Indian Scientists Create GlowCas9 Protein for Gene Therapy
  • 'గ్లోక్యాస్9' అనే కొత్త క్రిస్పర్ ప్రొటీన్ ఆవిష్కరించిన కోల్‌కతా శాస్త్రవేత్తలు
  • జన్యు సవరణ ప్రక్రియలో కాంతిని వెదజల్లే ప్రత్యేక ప్రొటీన్
  • క్యాన్సర్, జన్యు వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులకు అవకాశం
  • కణాలను నాశనం చేయకుండా జీన్ ఎడిటింగ్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించే వీలు
జన్యు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ చికిత్సలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తూ భారత శాస్త్రవేత్తలు ఒక అద్భుత ఆవిష్కరణ చేశారు. జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) చేస్తున్నప్పుడు వెలుగును విరజిమ్మే 'గ్లోక్యాస్9' అనే ఒక ప్రత్యేక క్రిస్పర్ ప్రొటీన్‌ను అభివృద్ధి చేశారు. కోల్‌కతాలోని బోస్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

సాధారణంగా క్రిస్పర్-క్యాస్9 టెక్నాలజీ ద్వారా డీఎన్‌ఏను కత్తిరించి, సరిచేయడం సాధ్యమే. కానీ, ఈ ప్రక్రియను జీవించి ఉన్న కణాల్లో ప్రత్యక్షంగా చూడటం ఇప్పటివరకు సాధ్యపడలేదు. కణాలను నాశనం చేస్తేనే ఆ ప్రక్రియను గమనించగలిగేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు బోస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ బసుదేబ్ మాజి నేతృత్వంలోని బృందం 'గ్లోక్యాస్9'ను రూపొందించింది. సముద్ర గర్భంలోని రొయ్యల ప్రొటీన్ల నుంచి సేకరించిన నానో-లూసిఫెరేజ్ అనే ఎంజైమ్‌ను క్యాస్9తో కలపడం ద్వారా దీనిని సృష్టించారు. జన్యు సవరణ సమయంలో ఈ ప్రొటీన్ మిణుకుమిణుకుమంటూ వెలుగును వెదజల్లుతుంది.

ఈ కొత్త ప్రొటీన్ సాయంతో, కణాలకు హాని కలగకుండానే జన్యు సవరణ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా, సాధారణ క్యాస్9 ఎంజైమ్‌తో పోలిస్తే 'గ్లోక్యాస్9' అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా స్థిరంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఇది జన్యు చికిత్సల విజయవంతానికి ఎంతో కీలకం. ముఖ్యంగా సికిల్ సెల్ ఎనీమియా, కండరాల క్షీణత వంటి వ్యాధులకు కారణమైన జన్యు లోపాలను సరిచేసే హెచ్‌డీఆర్ (హోమోలజీ-డైరెక్టెడ్ రిపేర్) ప్రక్రియ కచ్చితత్వాన్ని ఇది గణనీయంగా పెంచుతుంది.

ఈ పరిశోధన వివరాలు 'ఆంగేవాంటె కెమీ ఇంటర్నేషనల్ ఎడిషన్' అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ టెక్నాలజీని మొక్కలపై కూడా ప్రయోగించవచ్చని, పంటల అభివృద్ధిలో సురక్షితమైన మార్పులకు ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆవిష్కరణ జన్యు చికిత్సా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Basudev Maji
gene editing
Crispr Cas9
GlowCas9
Bose Institute
genetic diseases
genome editing
Indian scientists
cancer treatment
HDR

More Telugu News