Venkata Ratnam: హైదరాబాదులో పట్టపగలు రియల్టర్ దారుణ హత్య

Hyderabad Real Estate Agent Venkata Ratnam Brutally Murdered
  • మల్కాజ్‌గిరిలో రియల్టర్ దారుణ హత్య
  • ద్విచక్రవాహనంపై వెళుతుండగా కాల్పులు, కత్తులతో దాడి
  • మృతుడు ధూల్‌పేట్‌కు చెందిన హిస్టరీ షీటర్ వెంకటరత్నంగా గుర్తింపు
  • పాతకక్షల కారణంగానే హత్య జరిగిందని పోలీసుల అనుమానం
హైదరాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. నేర చరిత్ర కలిగిన ఓ రియల్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం పట్టపగలే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మల్కాజ్‌గిరి సమీపంలోని సాకేత్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోస్టర్ బిల్‌బాంగ్ స్కూల్ సమీపంలో వెంకటరత్నం అనే రియల్టర్ తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా, దుండగులు అతడిని వెంబడించారు. వాహనంలో వచ్చిన నిందితులు మొదట వెంకటరత్నంపై కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో ఒక పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదు చేసి, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మృతుడు వెంకటరత్నం నగరంలోని ధూల్‌పేట్‌కు చెందిన హిస్టరీ షీటర్ అని, గతంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు. ఆ హత్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. 
Venkata Ratnam
Hyderabad
Real estate
Murder
Malkajgiri
Jawahar Nagar
Crime
Doolpet
Telangana
History sheeter

More Telugu News