Pawan Kalyan: ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం నన్ను ముగ్ధుడ్ని చేసింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan Visits Udupi Temple in Karnataka
  • ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • భారతదేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఉడుపి అని అభివర్ణించిన వైనం
  • బృహత్ గీతోత్సవంలో పాల్గొని భగవద్గీత సందేశాన్ని స్మరించుకున్న పవన్
  • శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలోని కార్యక్రమాలపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడుపిని సందర్శించారు. ఈ పవిత్ర భూమి భారతదేశపు ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని ఆయన అభివర్ణించారు. శ్రీకృష్ణుడు నిత్యం కొలువై ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. బృహత్ గీతోత్సవం శుభ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుకోవడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "శ్రీకృష్ణుడు కొలువైన, ముఖ్యప్రాణ హనుమంతుడు శాశ్వత సంరక్షకుడిగా నిలిచిన, జగద్గురు మధ్వాచార్యులు తన జ్ఞానంతో ఎందరినో చైతన్యపరిచిన పవిత్ర భూమి ఉడిపి. మన నాగరికతకు ఆత్మలాంటి భగవద్గీత సందేశాన్ని జరుపుకునేందుకు భక్తులతో కలవడం ఆనందంగా ఉంది" అని తెలిపారు.

శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దార్శనిక మార్గదర్శకత్వంలో ఈ పవిత్ర భూమి చారిత్రక ఆధ్యాత్మిక ఉద్యమాలకు సాక్షిగా నిలుస్తోందని పవన్ ప్రశంసించారు. కోటి భగవద్గీత చేతిరాత ప్రాజెక్టు నుంచి లక్ష కంఠ పారాయణం వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. భగవద్గీత సందేశం మన చర్యలకు మార్గనిర్దేశం చేసి, సమాజాన్ని బలోపేతం చేసి, జాతీయ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం జై శ్రీ కృష్ణ, జై హనుమాన్, జై హింద్ అంటూ తన సందేశాన్ని ముగించారు.
Pawan Kalyan
Andhra Pradesh
Udupi
Sri Krishna
Karnataka
Bhagavad Gita
Spiritual
Sugunendra Tirtha Swamiji
Hinduism

More Telugu News