Virat Kohli: కోహ్లీ ఫామ్ పై గవాస్కర్ ఏమన్నాడంటే...!

Virat Kohli Can Reach 100 Centuries Says Gavaskar
  • విరాట్ కోహ్లీ 100 సెంచరీలు సాధించగలడని గవాస్కర్ జోస్యం
  • సౌతాఫ్రికాతో సిరీస్‌లో విరాట్ అద్భుత ఫామ్‌పై ప్రశంసలు
  • 2027 ప్రపంచకప్ వరకు ఆడితే రికార్డు సాధ్యమన్న గవాస్కర్
  • న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు విరామంపై ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసే సత్తా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కోహ్లీ ప్రదర్శించిన అద్భుతమైన ఫామ్‌ను చూస్తే ఈ రికార్డును అందుకోవడం అసాధ్యమేమీ కాదని విశ్లేషించాడు. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లీ తన కెరీర్‌ను కొనసాగించే సత్తా ఉందని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ రెండు సెంచరీలతో సహా మొత్తం 302 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ఈ సిరీస్ ముగిసిన అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 శతకాలున్నాయి. వంద సెంచరీల మార్కును చేరడానికి మరో 16 శతకాలు అవసరం. కోహ్లీ కనీసం మరో మూడేళ్లు ఆడితే ఇది సాధ్యమే. అతను తన బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నాడు" అని గవాస్కర్ తెలిపాడు.

"2027 ప్రపంచకప్‌ నాటికి భారత్ దాదాపు 35 వన్డేలు ఆడే అవకాశముంది. కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగిస్తే 100 సెంచరీలు పూర్తి చేయగలడు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు నెల రోజుల విరామం దొరికింది. ఈ గ్యాప్ అతని ఫామ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి" అని గవాస్కర్ విశ్లేషించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ మాత్రమే 100 సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి జరగనుంది. 
Virat Kohli
Kohli centuries
Sunil Gavaskar
Sachin Tendulkar
India cricket
South Africa series
2027 World Cup
Cricket record
ODI series
Batting form

More Telugu News