TG Viswa Prasad: ‘అఖండ 2’ విడుదల వివాదం నన్ను కలచివేసింది.. ఆఖ‌రి నిమిషంలో సినిమాలు ఆపడం దారుణం: నిర్మాత టీజీ విశ్వప్రసాద్

TG Viswa Prasad Disturbed by Akhanda 2 Release Controversy
  • చివరి నిమిషంలో సినిమాలు ఆపడం పరిశ్రమకు నష్టమన్న నిర్మాత‌
  • దీనివల్ల వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడుతుందని వెల్లడి
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు అవసరమని సూచన
  • ప్రభాస్ ‘రాజా సాబ్’ పెట్టుబడులపై స్పష్టత ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల విషయంలో తలెత్తిన వివాదం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలను చివరి నిమిషంలో అడ్డుకోవడం పరిశ్రమకు ఎంతో నష్టం చేస్తుందని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని అన్నారు.

ఈ విషయంపై తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, "విడుదలకు ముందు సినిమాలను ఆపివేయడం చాలా దురదృష్టకరం. దీని ప్రభావం పరిశ్రమలోని ఎంతో మందిపై పడుతుంది. నటీనటులు, పెద్ద సినిమాలతో పాటు తమ చిత్రాలను విడుదల చేయాలనుకునే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారు" అని పేర్కొన్నారు. ‘అఖండ 2’ వివాదం తనను ఎంతగానో బాధించిందని తెలిపారు.

“చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణం. సినిమాకు సమగ్రత కావాలి కానీ, జోక్యం కాదు. ఇలాంటి చర్యల వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, టెక్నీషియన్లు సహా వేలాది మంది ఉపాధి దెబ్బతింటుంది" అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠినమైన చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభాస్‌తో నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన పెట్టుబడులన్నీ అంతర్గత నిధుల ద్వారా పూర్తిగా చెల్లించామని, మిగిలిన చిన్న మొత్తాలను కూడా త్వరలోనే సెటిల్ చేస్తామని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ‘అఖండ 2’, ‘రాజా సాబ్’తో పాటు డిసెంబర్, సంక్రాంతికి విడుదల కానున్న అన్ని చిత్రాలు ఘనవిజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
TG Viswa Prasad
Akhanda 2
Nandamuri Balakrishna
People Media Factory
Raja Saab
Telugu cinema
film release controversy
movie industry
Tollywood
Prabhas

More Telugu News