Ed Bombas: ఒక్క వీడియోతో మారిన జీవితం.. మాజీ సైనికుడిని ఆదుకున్న ఆన్‌లైన్ ప్రపంచం

US Army Veteran Ed Bombas Aided by Online Donations
  • 88 ఏళ్ల అమెరికా ఆర్మీ వెటరన్‌కు భారీ మద్దతు
  • అత‌ని కోసం రూ.15 కోట్లు సేకరించిన నెటిజన్లు
  • ఒక్క సోషల్ మీడియా వీడియోతో మారిన వృద్ధుడి జీవితం
  • భార్య వైద్య ఖర్చుల కోసం సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం
  • ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ చొరవతో భారీ ఆర్థిక సహాయం
వృద్ధాప్యంలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న 88 ఏళ్ల అమెరికా ఆర్మీ మాజీ సైనికుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు అండగా నిలిచారు. ఆయన ప్రశాంతంగా రిటైర్మెంట్ జీవితం గడిపేందుకు ఏకంగా 1.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15 కోట్లు) విరాళంగా అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సంఘటన మానవత్వానికి నిలువుటద్దంలా నిలుస్తోంది.

మిషిగాన్‌కు చెందిన ఎడ్ బంబాస్ అనే 88 ఏళ్ల వృద్ధుడు, ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత తన పెన్షన్ కోల్పోయారు. దీనికి తోడు అనారోగ్యంతో బాధపడుతున్న భార్య వైద్య ఖర్చుల కోసం తన సేవింగ్స్‌ మొత్తాన్ని ఖర్చు చేసేశారు. దీంతో బ‌త‌క‌డానికి గత ఐదేళ్లుగా ఓ సూపర్ మార్కెట్‌లో రోజుకు ఎనిమిది గంటల చొప్పున, వారానికి ఐదు రోజులు పనిచేస్తున్నారు.

ఆయన దీనస్థితిని ఆస్ట్రేలియాకు చెందిన శామ్యూల్ వైడెన్‌హోఫర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. కోటి మందికి పైగా వీక్షించడంతో ఎడ్ బంబాస్ కష్టం అందరినీ కదిలించింది. వెంటనే శామ్యూల్.. ఆయన సహాయార్థం 'గోఫండ్‌మీ' పేజీని ప్రారంభించారు.

"ఎడ్ తన దేశం కోసం పోరాడారు. జీవితాంతం పనిచేశారు. ఇప్పుడు మనం ఆయనకు అండగా నిలబడాలి. పెద్దలు, సైనికులు గౌరవంగా జీవించాలి. మనం సేకరించే ప్రతి డాలర్ ఆయన జీవన ఖర్చులు, వైద్య సంరక్షణకు ఉపయోగపడుతుంది" అని శామ్యూల్ తన పోస్టులో పేర్కొన్నారు. 

ఈ పిలుపునకు అద్భుతమైన స్పందన లభించింది. వేలాది మంది ముందుకు వచ్చి విరాళాలు అందించారు. దీంతో ఇప్పుడు ఎడ్ బంబాస్ సూపర్ మార్కెట్ ఉద్యోగానికి వీడ్కోలు పలికి, తన విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపే అవకాశం లభించింది.
Ed Bombas
US Army veteran
Michigan
Samuel Weidenhofer
GoFundMe
viral video
retirement
financial assistance
social media
elderly care

More Telugu News