S Jaishankar: ఆ పరిస్థితులే హసీనాను ఇక్కడికి తీసుకొచ్చాయి: ఎస్ జైశంకర్

Sheikh Hasinas India visit due to special circumstances says Jaishankar
  • భారత్‌లో షేక్ హసీనా ఉండటం ఆమె వ్యక్తిగత నిర్ణయమన్న జైశంకర్
  • ప్రత్యేక పరిస్థితుల వల్లే ఆమె భారత్‌కు వచ్చారని వెల్లడి
  • గతేడాది బంగ్లాదేశ్‌లో హింస తర్వాత భారత్‌ చేరుకున్న హ‌సీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండటం పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని, ఆమె దేశానికి రావడానికి దారితీసిన 'ప్రత్యేక పరిస్థితులే' ఈ విషయంలో కీలక పాత్ర పోషించాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈరోజు జరిగిన హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన భారీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో, 15 ఏళ్ల పాటు సాగిన షేక్ హసీనా పాలన ముగిసింది. ఆ సమయంలో ఆమె భారత్‌కు పారిపోయి వచ్చారు. కాగా, గతేడాది జరిగిన విద్యార్థి నిరసనలపై ఆమె ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో, 'మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు' పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ గత నెలలో ఆమెకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో 'ఆమె కోరుకున్నంత కాలం ఇక్కడ ఉండవచ్చా?' అని అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ, "ఆమె ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు. ఆమె భవిష్యత్తు విషయంలో ఆ పరిస్థితులే ఒక ముఖ్యమైన అంశం. అయితే, దీనిపై అంతిమ నిర్ణయం ఆమెనే తీసుకోవాలి" అని వివరించారు.

ఇరు దేశాల సంబంధాలపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో విశ్వసనీయమైన ప్రజాస్వామ్య ప్రక్రియ జరగాలన్నదే భారత్ వైఖరి అని జైశంకర్ స్పష్టం చేశారు. "బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పాలకులు గత ఎన్నికల విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికలే సమస్య అయితే, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే మొదటి ప్రాధాన్యత కావాలి. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ఇరు దేశాల సంబంధాలపై సమతుల్య దృక్పథంతో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను" అని ఆయన అన్నారు.
S Jaishankar
Sheikh Hasina
Bangladesh
India
Bangladesh politics
India Bangladesh relations
HT Leadership Summit
Bangladesh elections
Democracy Bangladesh
Political asylum

More Telugu News