Anam Ramanarayana Reddy: 9 నోట్ల దొంగతనానికి 14 కోట్లు రాజీనా?: జగన్‌పై ఆనం ఫైర్

Anam Ramanarayana Reddy Fires at Jagan Government Over TTD Scams
  • జగన్ మాఫియా నాయకుడే కానీ, రాజకీయ నాయకుడు కాలేడన్న ఆనం
  • పాల చుక్క లేకుండా నెయ్యి తయారుచేశారని ఎద్దేవా
  • తిరుమల ప్రక్షాళనకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడి
వైసీపీ అధినేత జగన్ పై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక మాఫియా నాయకుడే తప్ప, ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని తీవ్రంగా దుయ్యబట్టారు. తిరుమల శ్రీవారి సొమ్మును కూడా దోచుకున్నారని, దొంగే దొంగ అని అరిచినట్టుగా జగన్ ప్రవర్తన ఉందని ఆయన మండిపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు.

తిరుమల పరకామణిలో కేవలం 9 నోట్లు దొంగిలించిన కేసులో రూ.14 కోట్లకు ఎలా రాజీ కుదిర్చారని జగన్‌ను ప్రశ్నించారు. వందల కోట్ల విలువైన ఆస్తులను వైసీపీ నేతల పేర్ల మీద రాయించుకుని, లోక్ అదాలత్‌లో రాజీ చేయించారని ఆరోపించారు. వీడియో సాక్ష్యాలున్నా దీన్ని చిన్న దొంగతనమని జగన్ కొట్టిపారేయడం విడ్డూరంగా ఉందన్నారు. "దేవుడి సొమ్ము దోచిన దొంగను దోచుకుని, ఆ దొంగలకే పెద్దన్నలా నిలిచిన వ్యక్తి జగన్" అని తీవ్రంగా విమర్శించారు.

వైసీపీ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కూడా ఆనం ప్రస్తావించారు. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా నెయ్యి తయారు చేయడం ప్రపంచంలోనే 9వ వింత అని ఎద్దేవా చేశారు. ఈ కల్తీ నెయ్యికి టెండర్లు పిలిచి, కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ వ్యవహారాన్ని గుర్తించి చర్యలు తీసుకుందని తెలిపారు.

ఐదేళ్ల పాలనలో జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని డ్రగ్స్, లిక్కర్, భూ మాఫియాలను పెంచి పోషించారని ఆనం ఆరోపించారు. దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమవుతుందో జగన్ పాలనే నిదర్శనమని విమర్శించారు. ప్రజలను, రాష్ట్రాన్ని దోచుకుని చివరికి దేవుడిని కూడా వదల్లేదని, ఇప్పటికైనా జగన్ స్వామివారికి క్షమాపణ చెప్పాలని సూచించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దేవాలయాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారని, తిరుమలలో మాఫియా ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తామని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. 
Anam Ramanarayana Reddy
TTD scams
Tirumala Tirupati Devasthanam
Jagan Mohan Reddy
Andhra Pradesh Endowments Minister
TTD Laddoo
Parakamani Hundi
Corruption allegations
YSRCP government
Tirupati

More Telugu News