మా స్నేహంపై ఎవరికీ వీటో అధికారం లేదు: అమెరికాకు జైశంకర్ పరోక్ష సందేశం
- పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు
- రష్యాతో భారత బంధం ప్రత్యేకమైనదని వ్యాఖ్య
- విదేశాంగ విధానం అంటే ఇతరులను సంతోష పెట్టడం కాదన్న జైశంకర్
గడిచిన 70-80 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా అనేక భౌగోళిక, రాజకీయ మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, భారత్-రష్యా మధ్య సంబంధాలు అత్యంత స్థిరంగా కొనసాగాయని జైశంకర్ అన్నారు. ఇతర దేశాలతో రష్యాకు, అలాగే వేరే దేశాలతో భారత్‌కు సంబంధాలలో హెచ్చుతగ్గులు ఉన్నా, భారత్-రష్యా బంధం మాత్రం నిలకడగా ఉందని గుర్తుచేశారు. రష్యా పట్ల భారత ప్రజల్లో కూడా ఒక ప్రత్యేకమైన భావన ఉందని ఆయన పేర్కొన్నారు.
విదేశాంగ విధానం అంటే ఇతరులను సంతోషపెట్టడం కాదని, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిలబడటమని ఆయన గట్టిగా చెప్పారు. ప్రపంచంలో వీలైనంత ఎక్కువ దేశాలతో సహకారం కొనసాగించడం, భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.
అదే సమయంలో అమెరికాతో సంబంధాల విషయంలో ఎలాంటి సమాచార లోపం లేదని, త్వరలోనే వాషింగ్టన్‌తో కీలక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆ ఒప్పందం విషయంలో భారత రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు.