Chhattisgarh High Court: భార్య ఆత్మహత్య బెదిరింపులు కూడా క్రూరత్వమే.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు

Wifes Suicide Threats Mental Cruelty Chhattisgarh High Court
  • మత మార్పిడికి ఒత్తిడి చేయడం కూడా హింస కిందకే వస్తుందన్న కోర్టు
  • ఫ్యామిలీ కోర్టు విడాకుల తీర్పును సమర్థించిన ఉన్నత న్యాయస్థానం
  • భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు
భార్య పదేపదే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, మతం మారాలని ఒత్తిడి చేయడం భర్తపై మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ప్రవర్తన విడాకులకు బలమైన కారణంగా నిలుస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

బలోద్ జిల్లాకు చెందిన దంపతులకు 2018 మే నెలలో వివాహమైంది. అయితే, పెళ్లయిన కొంత కాలానికే భార్య ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టింది. పాయిజన్ తాగడం, కత్తితో పొడుచుకోవడం, కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడం వంటి ప్రయత్నాలు చేసిందని, దీంతో తాను నిత్యం భయంతో బతకాల్సి వచ్చిందని భర్త 2019 అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

జస్టిస్ రజనీ దూబే, జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. క్రూరత్వం అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదని, భాగస్వామి మనసులో భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా దాని కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. భార్య ఆత్మహత్య బెదిరింపుల కారణంగానే ఆమెను పుట్టింట్లో వదిలిపెట్టినట్లు భర్త విచారణలో అంగీకరించిన విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

దీంతో పాటు, ఇస్లాం మతంలోకి మారాలని భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి తెచ్చారని భర్త ఆరోపించాడు. దీనికి సంబంధించిన సాక్ష్యాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. 2019 నవంబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, తిరిగి కాపురానికి వచ్చేందుకు భార్య ఆసక్తి చూపలేదని కోర్టు నిర్ధారించింది. భార్య ప్రవర్తన చట్ట ప్రకారం క్రూరత్వంగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును సమర్థించి, ఆమె అప్పీల్‌ను కొట్టివేసింది.
Chhattisgarh High Court
Divorce
Suicide threats
Mental Cruelty
Balod
Family Court
Rajani Dubey
Amitendra Kishor Prasad
Chhattisgarh

More Telugu News