Chevireddy Bhaskar Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ

Chevireddy Bhaskar Reddy Setback in AP Liquor Scam Case
  • చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా నలుగురి బెయిల్ పిటిషన్ల కొట్టివేత
  • నిందితులకు డిసెంబర్ 19 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
  • దర్యాప్తు దశలో బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందని ప్రాసిక్యూషన్ వాదన
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి న్యాయస్థానంలో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో వీరి జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయాధికారి భాస్కరరావు విచారణ చేపట్టారు. ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. నిందితుల పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని, కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
 
అలానే, నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు వారిని విజయవాడ, గుంటూరు జైళ్ల నుంచి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు వారికి డిసెంబర్ 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. అనంతరం వారిని తిరిగి కారాగారాలకు తరలించారు. ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి, పైలా దిలీప్ కోర్టుకు హాజరు కాలేదు. వారి తరఫు న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్ వేశారు.
 
ఇదే కేసులో మనీ రూటింగ్ ఆరోపణలతో అరెస్టయిన రోణక్ కుమార్‌కు జైల్లో ఇంటి భోజనం, దోమతెర ఏర్పాటు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించిన న్యాయమూర్తి, విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Chevireddy Bhaskar Reddy
AP Liquor Scam
YSRCP
Vijayawada ACB Court
Liquor Case Bail
Mithun Reddy
Pyla Dilip
Andhra Pradesh Politics

More Telugu News