KCR: అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు: సర్పంచ్‌లతో కేసీఆర్

KCR All Times Are Not Favorable To Us
  • కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి... వాటికి వెరవకూడదన్న కేసీఆర్
  • గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం
  • మర్యాదపూర్వకంగా కేసీఆర్‌ను కలిసిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు
అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవని, కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయని, వాటికి వెరవకూడదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని, తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాకా ప్రజలు అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. కొత్త సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివద్ధి చేసుకునేందుకు ముందుకు సాగాలని సూచించారు.

కేసీఆర్ దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, శాలువాతో సత్కరించి మిఠాయిలు పంచారు. ఈ రెండు గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అధినేతను కలిశారు.

నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచి నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్, వార్డు మెంబర్లు, నర్సన్నపేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య, ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారిని కేసీఆర్ ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని తెలిపారు. స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని అన్నారు.

దళిత, గిరిజన, బహుజన, మహిళా వర్గాలకు, కుల వృత్తులకు తాము అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.
KCR
K Chandrashekar Rao
BRS
Telangana
Sarpanch
Gajwel
Errvelli
Narsannapeta

More Telugu News