Tirumala: తిరుమల కొండపై డ్రోన్ కలకలం... పోలీసుల అదుపులో ఎన్నారై భక్తులు

Tirumala Drone Scare NRI Devotees in Police Custody
  • తిరుమల శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరేసిన జంట 
  • మూడంచెల భద్రతను దాటుకుని డ్రోన్ తెచ్చిన వైనం
  • ఎన్నారైలని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్
  • ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఘటన
  • గతంలోనూ ఇలాంటి ఘటనలు
తిరుమల పుణ్యక్షేత్రంలో మరోమారు డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కొండపైకి ఇద్దరు భక్తులు డ్రోన్‌ను తీసుకురావడం, దానిని యథేచ్ఛగా ఎగురవేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన టీటీడీ భద్రతా వైఫల్యాన్ని మరోసారి ఎత్తిచూపింది.

వివరాల్లోకి వెళితే... అర్జున్ దాస్, సులక్షణ దాస్ అనే ఇద్దరు ఎన్నారై భక్తులు తిరుమలకు డ్రోన్ కెమెరాను తీసుకువచ్చారు. అలిపిరి వద్ద ఉండే మూడంచెల భద్రతా తనిఖీ వ్యవస్థను దాటుకుని దీనిని కొండపైకి తీసుకెళ్లడం గమనార్హం. అనంతరం శిలాతోరణం సమీపంలో ఆ భక్తుడు డ్రోన్‌ను గాల్లోకి ఎగురవేశారు. దీనిని గమనించిన స్థానికులు, ఇతర భక్తులు వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు డ్రోన్‌ను ఎగరేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇస్కాన్‌కు చెందిన ఎన్నారైలుగా గుర్తించారు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని, అందులో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అనంతరం నిందితులను విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు, విమానాలు ఎగరడంపై పూర్తి నిషేధం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా కూడా తిరుమలలో డ్రోన్లపై నిషేధం విధించారు. అయినప్పటికీ గతంలోనూ ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగాయి. పటిష్ఠమైన భద్రత ఉందని చెబుతున్నప్పటికీ, డ్రోన్లు, మొబైల్ ఫోన్లు ఆలయం వద్దకు చేరుతుండటంపై భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Tirumala
Arjun Das
Sulakshana Das
Tirumala Drone
TTD
NRI devotees
Alipiri
Srivari Temple
Security breach
ISKCON

More Telugu News