Flying Kremlin: పుతిన్ విమానం ఓ అద్భుతం.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Vladimir Putins Flying Kremlin Features of the Russian Presidential Plane
  • భారత్ పర్యటనలో పుతిన్ విమానంపై ప్రత్యేక చర్చ
  • గాల్లో ఎగిరే క్రెమ్లిన్ కోటగా పిలిచే ఇల్యూషిన్ విమానం
  • అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే మొబైల్ కమాండ్ సెంటర్
  • విలాసవంతమైన ఇంటీరియర్.. అత్యాధునిక రక్షణ వ్యవస్థలు దీని సొంతం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత్-రష్యా వార్షిక సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కీలక చర్చలు జరుపుతున్నారు. అయితే, ఈ పర్యటనలో పుతిన్ కంటే.. ఆయన ప్రయాణించిన ప్రత్యేక విమానంపైనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చర్చ జరుగుతోంది. కేవలం విమానంలా కాకుండా ఆకాశంలో తేలియాడే ఒక అధ్యక్ష భవనంలా, సైనిక కార్యాలయంలా ఇది కనిపిస్తోంది.

రక్షణ వ్యవస్థలు..
పుతిన్ ప్రయాణించే విమానం పేరు ఇల్యూషిన్ IL-96-300PU. దీనిని 'ఫ్లయింగ్ క్రెమ్లిన్' (గాల్లో ఎగిరే క్రెమ్లిన్ కోట) అని పిలుస్తారు. ఇది కేవలం ప్రయాణ విమానం మాత్రమే కాదు, పూర్తిస్థాయి మొబైల్ కమాండ్ సెంటర్. అత్యవసర సమయాల్లో ఇక్కడి నుంచే సైనిక ఆదేశాలు, చివరికి అణ్వస్త్ర ఆదేశాలు కూడా జారీ చేసేలా దీన్ని రూపొందించారు. దీనిలోని అత్యాధునిక ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని ఏ సైనిక నెట్‌వర్క్‌తోనైనా సురక్షితంగా మాట్లాడవచ్చు.

ఎగిరే ఇంద్ర‌భ‌వ‌నం..
ఈ విమానం లోపలి భాగం ఒక విలాసవంతమైన భవనాన్ని తలపిస్తుంది. బంగారు పూతతో చేసిన వస్తువులు, ఖరీదైన ఫర్నిచర్, అధ్యక్షుడి కోసం ప్రత్యేక బెడ్‌రూమ్, కాన్ఫరెన్స్ హాల్, జిమ్ వంటి సదుపాయాలున్నాయి. అదే సమయంలో, భద్రత విషయంలోనూ ఇది అమోఘం. శత్రు క్షిపణులను దారి మళ్లించే వ్యవస్థలు, రాడార్ జామింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ దాడులను తట్టుకునే సామర్థ్యం దీని సొంతం.

పూర్తిగా రష్యాలోనే తయారైన ఈ విమానాన్ని వోరోనెజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ అసోసియేషన్ నిర్మించింది. దీనిలోని PU అనే అక్షరాలకు రష్యన్ భాషలో 'కమాండ్ పాయింట్' అని అర్థం. ఒక్కసారి ఇంధనం నింపితే సుమారు 11,000 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలదు. ప్రపంచంలోని చాలా దేశాధినేతలు అమెరికన్ బోయింగ్ లేదా యూరోపియన్ ఎయిర్‌బస్ విమానాలను ఉపయోగిస్తుండగా, పుతిన్ మాత్రం స్వదేశీ విమానాన్ని వినియోగించడం ద్వారా రష్యా సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.
Flying Kremlin
Vladimir Putin
Putin India visit
Russia India summit
Ilyushin IL-96-300PU
Russian presidential plane
Voronezh Aircraft Production Association
Mobile command center
Putin plane features

More Telugu News