RBI: ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లకు జోష్... లాభాల్లో ముగిసిన సూచీలు

RBI Boosts Stock Markets Sensex Nifty Close Higher
  • రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
  • లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
  • వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతానికి పెంచిన కేంద్ర బ్యాంక్
  • ద్రవ్యోల్బణం అంచనాలను 2 శాతానికి తగ్గింపు
  • పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగ షేర్లలో బలమైన కొనుగోళ్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలకమైన రెపో రేటును తగ్గించడంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆర్బీఐ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం సూచీలకు జోష్ ఇచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 447.05 పాయింట్లు లాభపడి 85,712.37 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152.7 పాయింట్లు పెరిగి 26,186.45 వద్ద ముగిసింది.

గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చింది. పాలసీ వైఖరిని మాత్రం ‘న్యూట్రల్’గానే కొనసాగించింది. దీంతో పాటు 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2 శాతానికి భారీగా తగ్గించింది. అదే సమయంలో వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది.

విశ్లేషకుల ప్రకారం, నిఫ్టీ కీలకమైన 26,000 పాయింట్ల మార్కుపైన స్థిరంగా ముగియడం సానుకూల సంకేతం. 26,000–26,100 స్థాయి వద్ద మార్కెట్‌కు బలమైన మద్దతు ఉందని, మార్కెట్ మరింత పైకి వెళ్లాలంటే 26,300 స్థాయిని దాటాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం పెరుగుదలతో టాప్ గెయినర్‌గా నిలిచింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభపడ్డాయి. 

మరోవైపు మీడియా, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు ప్రధానంగా లాభపడగా... హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ వంటి షేర్లు నష్టపోయాయి.
RBI
Reserve Bank of India
Stock Market
Sensex
Nifty
Repo Rate
Sanjay Malhotra
MPC
Inflation
Indian Economy

More Telugu News