Supreme Court: దేవాలయాల సంపద దేవుడిదే.. బ్యాంకులకు వాడొద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Says Temple Wealth Belongs to God Not Banks
  • గుడి డబ్బును సహకార బ్యాంకుల కోసం వాడరాదని ఆదేశం
  • కేరళ హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం
  • ప్రజల నమ్మకాన్ని బ్యాంకులు చూరగొనాలని జస్టిస్ సూర్యకాంత్ హితవు
దేవాలయాల ఆస్తులు, సంపదకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం ఒక సంచలన తీర్పు వెలువరించింది. ఆలయాల సంపద దేవుడికే చెందుతుందని, దాన్ని సహకార బ్యాంకుల మనుగడ కోసం వినియోగించరాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.

దేవాలయానికి చెందిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని కేరళ హైకోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ అక్కడి సహకార బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "సహకార బ్యాంకులను కాపాడటానికి గుడి డబ్బును ఉపయోగిస్తారా? దేవుడి డబ్బు కేవలం ఆలయ ప్రయోజనాల కోసమే వాడాలి. అది బ్యాంకులకు ఆదాయ మార్గం కాకూడదు" అని ఆయన అన్నారు. కస్టమర్ల నుంచి డిపాజిట్లు రాబట్టుకోలేకపోవడం అనేది సహకార బ్యాంకుల సమస్య... అందుకు దేవుడి సొమ్మును వాడటం సరికాదని హితవు పలికారు.

ప్రజల నుంచి నమ్మకాన్ని పొందడంలో బ్యాంకులు విఫలమైతే అది వాటి సమస్యేనని పేర్కొంటూ, సహకార బ్యాంకుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేవాలయాల డిపాజిట్లను తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది.

Supreme Court
Temple assets
Kerala High Court
Cooperative banks
Temple funds
Justice Surya Kant
Temple deposits
Indian judiciary

More Telugu News