Ayyappa devotee: పళనిలో తెలుగు అయ్యప్ప భక్తుడిపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత

Ayyappa Devotee Attacked in Palani Creates Tension
  • MRP కంటే ఎక్కువ ధర అడగటంతో మొదలైన వివాదం
  • గాజు సీసాతో కొట్టి, మెడలోని మాలను తెంపిన దుకాణదారుడు
  • నిందితుడిని శిక్షించాలని తెలుగు భక్తుల ఆందోళన
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళనిలో దారుణం చోటుచేసుకుంది. శబరిమల యాత్రలో భాగంగా సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అయ్యప్ప భక్తుడిపై స్థానిక దుకాణదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల యాత్రలో భాగంగా పళని క్షేత్రానికి చేరుకుంది. వారిలో ఒక భక్తుడు సమీపంలోని దుకాణానికి వెళ్లి వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్ కొనుగోలు చేయబోయారు. వాటిపై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) రూ.30 ఉండగా, దుకాణదారుడు రూ.40 ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని భక్తుడు ప్రశ్నించడంతో, వ్యాపారి తమిళంలో దూషిస్తూ మాటామాటా పెంచాడు. ఆవేశంతో ఊగిపోయిన అతను, గాజు సీసాతో భక్తుడి తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో భక్తుడికి తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగకుండా, దుండగుడు బాధితుడి మెడలోని పవిత్రమైన అయ్యప్ప దీక్షా మాలను సైతం తెంచివేశాడు.

ఈ విషయం తెలియగానే సమీపంలో ఉన్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే, స్థానికులు వ్యాపారికి మద్దతుగా నిలవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. భక్తులు రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భక్తులు స్పష్టం చేశారు.
Ayyappa devotee
Palani
Tamil Nadu
Ayyappa devotee attack
Andhra Pradesh
Sabarimala
Pilgrimage
Crime news
Telugu devotees
Palani Temple

More Telugu News