Chhattisgarh: ఆరేళ్ల వయసులో గదిలోకి.. 26 ఏళ్లకు బయటకు.. వెలుగు చూసి కళ్లు కోల్పోయిన యువతి!

Locked In Darkness For 20 Years Bastar Woman Finally Sees The Light Of Freedom
  • 20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి
  • భద్రత పేరుతో తండ్రే కూతురిని గదిలో నిర్బంధించిన వైనం
  • చూపు కోల్పోయి, తీవ్ర‌ మానసిక వేద‌న‌లో లీసా
  • ప్రస్తుతం సంక్షేమ ఆశ్రమంలో చికిత్స.. విచారణకు ప్రభుత్వ ఆదేశం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో అత్యంత హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రత పేరుతో ఓ తండ్రి తన కూతురిని ఏకంగా 20 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించాడు. ఇటీవల అధికారులు ఆమెను రక్షించి బయటకు తీసుకురాగా, సుదీర్ఘకాలం వెలుగు చూడకపోవడంతో ఆమె తన కంటిచూపును దాదాపు పూర్తిగా కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. బకావండ్ గ్రామానికి చెందిన లీసా అనే యువతికి ఆరేళ్ల వయసులో ఈ నరకం మొదలైంది. 2000 సంవత్సరంలో ఆమె రెండో తరగతి చదువుతున్నప్పుడు, గ్రామస్థుడు ఒకరు ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపుతో తీవ్ర భయాందోళనకు గురైన లీసా, బయటకు రావాలంటేనే జంకేది. భార్యను కోల్పోయి, ఒంటరివాడైన ఆమె తండ్రి.. తన కూతురిని ఎలా కాపాడుకోవాలో తెలియక, ఆమెను ఇంట్లోని ఓ కిటికీలు లేని గదిలో బంధించాడు.

గత 20 ఏళ్లుగా ఆ చీకటి గదే ఆమె ప్రపంచమైంది. ఆహారం అందించడానికి మాత్రమే ఆ గది తలుపు తెరుచుకునేది. ఇటీవల అధికారులు ఆమెను రక్షించే సమయానికి, ఆమె మనుషులను చూసి భయపడటం, కనీసం తన పేరుకు కూడా స్పందించలేని స్థితిలో ఉంది. సుదీర్ఘకాలం కాంతికి దూరంగా ఉండటంతో ఆమె కంటిచూపు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తెలిపారు. మానసికంగా కూడా ఆమె ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది.

ప్రస్తుతం లీసాను 'ఘరౌందా ఆశ్రమం'లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. "మాకు సమాచారం అందగానే ఆమెను రక్షించాం. ఆమె ఇప్పుడు సురక్షితంగా ఉంది. మొదట్లో మనుషులను చూసి భయపడేది. ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడుతోంది" అని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుచిత్రా లక్రా తెలిపారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Chhattisgarh
Lisa
Bastar district
Dark confinement
Loss of sight
Gharaunda Ashram
Social Welfare Department
Bakawand village
India news
Child protection

More Telugu News