తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు.. నేడు ఆన్లైన్లో విడుదల
- జనవరి 2 నుంచి 8 వరకు దర్శనానికి సంబంధించిన కోటా విడుదల
- ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్లు
- మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీవాణి కోటా టికెట్లను విడుదల చేస్తారు. రోజుకు వెయ్యి టికెట్ల చొప్పున ఏడు రోజులకు సంబంధించిన కోటాను భక్తులు బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కోటాలో భాగంగా రోజుకు 15 వేల టికెట్లు కేటాయించారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు సంబంధించిన టికెట్లను ఇదివరకే ఈ-డిప్ విధానంలో కేటాయించినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం మిగిలిన ఏడు రోజులకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.