Virat Kohli: ఒక్క కోహ్లీ.. వైజాగ్‌ వన్డే టికెట్ల అమ్మకాన్ని అమాంతం పెంచేశాడు!

Vizag ODI Ticket Demand Soars After Virat Kohli Centuries
  • తొలుత అంతంత మాత్రంగా సాగిన టికెట్ల అమ్మకాలు
  • కోహ్లీ శతకాల తర్వాత నిమిషాల్లోనే అన్నీ సోల్డ్ అవుట్
  • విశాఖలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నంలో జరగనున్న మూడో వన్డేపై మొదట్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి వరుసగా రెండు సెంచరీలు బాదడంతో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. ఈ మ్యాచ్ టికెట్లకు ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ స్థాయిలో స్పందన రావడం చాలా అరుదని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చెబుతోంది.

నవంబర్ 28న ఈ మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌లో తొలి దశ టికెట్ల అమ్మకాలు ప్రారంభమైనప్పుడు స్పందన చాలా తక్కువగా వుంది. దీంతో ఏసీఏ అధికారులు ఆఫ్‌లైన్‌లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, రాంచీ, రాయ్‌పూర్‌లలో కోహ్లీ శతకాలు బాదడంతో పరిస్థితి మారిపోయింది. "కోహ్లీ రాంచీ సెంచరీ తర్వాత, రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. ఒక్క టికెట్ కూడా మిగల్లేదు" అని ఏసీఏ మీడియా ప్రతినిధి వై. వెంకటేశ్ తెలిపారు.

విశాఖలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉండటం కూడా ఈ క్రేజ్‌కు మరో ముఖ్య కారణం. ఇక్కడ ఆడిన ఏడు వన్డేల్లో కోహ్లీ 97.83 సగటుతో మూడు సెంచరీలు, ఒకసారి 99, ఇంకోసారి 65 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు రూ. 1,200 నుంచి రూ. 18,000 వరకు ఉన్నప్పటికీ, అభిమానులు ఏమాత్రం వెనుకాడలేదు.

కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో అభిమానుల ఉత్సాహం ఎయిర్‌పోర్టుల వద్ద స్పష్టంగా కనిపించింది. నిన్న భారత జట్టు కోసం విశాఖ ఎయిర్‌పోర్టులో అభిమానులు గంటల తరబడి ఎదురుచూశారు. రాయ్‌పూర్ నుంచి విమానం ఆలస్యమైనా ఓపికగా నిరీక్షించారు. అటు రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విమానాల ఆలస్యంపై అసహనంగా ఉన్న ప్రయాణికులు సైతం, కోహ్లీని చూడగానే తమ అసహనాన్ని మర్చిపోయి కేరింతలు కొట్టారు.

ప్రస్తుతం భారత జట్టు విశాఖకు చేరుకుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Virat Kohli
India vs South Africa
Vizag ODI
ACA-VDCA Stadium
India Cricket
Cricket Tickets
Visakhapatnam
YSR Cricket Stadium
Kohli Century

More Telugu News