K Srinivasulu: సర్వే అధికారి ఇంట్లో 1.6 కిలోల బంగారం.. ఆస్తులు చూసి నివ్వెరపోయిన అధికారులు

Rangareddy Land Records Director K Srinivasulu Faces Corruption Charges
  • రంగారెడ్డి జిల్లా సర్వే ఏడీ శ్రీనివాసులపై ఏసీబీ కేసు
  • ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారుల దాడులు
  • సోదాల్లో భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం
  • రైస్ మిల్లు, ఫ్లాట్లు, పలు రాష్ట్రాల్లో వ్యవసాయ భూముల గుర్తింపు
రంగారెడ్డి జిల్లా సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) కె.శ్రీనివాసులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిన్న ఆయనపై కేసు నమోదు చేసి, ఏకకాలంలో పలుచోట్ల దాడులు నిర్వహించారు. శ్రీనివాసులు నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లు సహా మొత్తం 6 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.

ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మైహోమ్‌ భూజాలో ఒక ఫ్లాట్‌, నారాయణపేట జిల్లాలో రైస్‌మిల్లు, మూడు ఇళ్ల ప్లాట్లు, మహబూబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల్లో 11 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

రాయదుర్గంలోని శ్రీనివాసులు నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. ఆయనకు రెండు కార్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్‌ విలువ, డాక్యుమెంట్లలో చూపిన విలువ కంటే చాలా రెట్లు అధికంగా ఉంటుందని డీజీ వెల్లడించారు.

శ్రీనివాసులుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై గతేడాది సెప్టెంబరులో నమోదైన కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి ఏడీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి 7 గంటల వరకు కొనసాగాయి. అధికారులు కీలకమైన భూ రికార్డులు, కంప్యూటర్‌, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
K Srinivasulu
Rangareddy district
ACB raids
illegal assets case
land records assistant director
corruption case
Hyderabad real estate
rice mill
gold jewellery
disproportionate assets

More Telugu News