Lakshmi Narayana: గీతను చదివిన వారు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Lakshmi Narayana Says Gita Helps Face Life Courageously
  • రక్తంతో లేఖలు రాసి నన్ను బెదిరించారన్న జేడీ లక్ష్మీనారాయణ
  • కష్టకాలంలో భగవద్గీత ధైర్యాన్నిచ్చిందన్న జేడీ 
  • గాంధీ, నేతాజీ కూడా గీతను నమ్ముకున్నారని వెల్లడి
సీబీఐలో పనిచేస్తున్న సమయంలో తనను చంపుతామని బెదిరిస్తూ రక్తంతో లేఖలు వచ్చాయని ఆ సంస్థ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ సంచలన విషయాలు వెల్లడించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో భగవద్గీత తనకు ధైర్యాన్నిచ్చి నిలబెట్టిందని ఆయన స్పష్టం చేశారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4,028 మంది విద్యార్థులు సామూహికంగా భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. "సీబీఐలో ఉన్నప్పుడు ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్నాను. నన్ను భయపెట్టేందుకు కొందరు రక్తంతో లేఖలు రాశారు. 'నీ రక్తం చూస్తాం' అని హెచ్చరించారు. అయినా నేను భయపడలేదు. భగవద్గీతపై ఉన్న నమ్మకంతోనే నా కర్తవ్యాన్ని నిర్భయంగా నిర్వర్తించాను" అని తెలిపారు.

భగవద్గీత విద్యార్థుల్లో నైతిక విలువలు, ధైర్యం, నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అహింసను బోధించిన మహాత్మా గాంధీ, సాయుధ పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు కూడా గీతను ఆశ్రయించారని గుర్తు చేశారు. భగవద్గీత ప్రపంచానికే మార్గదర్శకమని, అది భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు. "గీతను చదివిన వారు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు. ఇది నా ప్రత్యక్ష అనుభవం" అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 
Lakshmi Narayana
VV Lakshmi Narayana
Bhagavad Gita
CBI
Joint Director CBI
Kurnool
Moral Values
গীতা
গীতা পাঠ
গীতার শিক্ষা

More Telugu News