Bunny Vasu: పుష్ప-2 తొక్కిసలాట, బాలుడికి సాయంపై స్పందించిన బన్నీ వాసు

Bunny Vasu Responds to Pushpa 2 Stampede Victim Sri Tej
  • దిల్ రాజు సహా సినిమా పెద్దలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడి
  • శ్రీతేజ్ కుటుంబానికి ఇంకా ఏమైనా కావాలంటే పెద్దమనుషులతో వచ్చి మాట్లాడాలని సూచన
  • మా వైపు నుంచి ఏవైనా దిద్దుకునేవి ఉంటే సిద్ధంగా ఉన్నామని వెల్లడి
గత సంవత్సరం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ అంశంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. త్రిగుణ్, హెబ్బా పటేల్ కీలక పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'ఈషా' డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసిన సందర్భంగా బన్నీ వాసు మాట్లాడారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు శ్రీతేజ్, అతడి కుటుంబం గురించి ప్రశ్నించారు. తొక్కిసలాటలో గాయపడిన బాలుడికి అందుతున్న సాయం ప్రస్తుతం ఎలా ఉందని వారు అడిగారు.

దిల్ రాజు సహా ఇతర సినీ పెద్దలు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. రెండు వైపుల నుంచి ఏ సమస్య వచ్చినా మాట్లాడుకుని ముందుకు వెళుతున్నామని అన్నారు. సాయంపై బాధిత కుటుంబం సంతృప్తిగా ఉందా లేదా అంటే తాము కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని అన్నారు. ఫండ్‌ను ఏం చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఆసుపత్రికి ఎంత చెల్లించాలి, వారి కుటుంబానికి నెలవారీ ఎంత వెళ్లాలనే అంశాలపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీతేజ్ కుటుంబానికి ఇంకా ఏమైనా కావాలంటే పెద్దమనుషులతో వచ్చి మాట్లాడవచ్చని సూచించారు. తమ వైపు ఏవైనా దిద్దుబాటు చర్యలు అవసరమైతే అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని అన్నారు. ఈ విషయాలు చర్చించేందుకు పెద్దలు ఉన్నారని, వాళ్లు చూసుకుంటారని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇంతకుమించి మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదని పేర్కొన్నారు.

టిక్కెట్ ధరల పెంపుపై కూడా ఆయన స్పందించారు. టిక్కెట్ ధరలో కేవలం 28 శాతం మాత్రమే నిర్మాతలకు చేరుతోందని వెల్లడించారు. సినిమా కాస్త బాగా ఆడి డబ్బులు వస్తే అందులో 30 శాతం ఆదాయపు పన్ను కడుతున్నామని, రూ.600 టిక్కెట్ ధర పెడితే మొత్తం నిర్మాతే తినేస్తున్నాడని అనుకోవడం సరికాదని అన్నారు. టిక్కెట్ మొత్తంలో ఎవరికి ఎంత వెళుతుందనే విషయం ప్రజలకు వెల్లడిస్తే బాగుంటుందని సూచించారు.
Bunny Vasu
Pushpa 2
Sri Tej
Eesha Movie
Dil Raju
Tollywood
Film industry
Ticket prices

More Telugu News