Jagan Mohan Reddy: చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవు: జగన్

Jagan Slams Chandrababu Over Tirumala Ladoo Allegations
  • తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబుది దుష్ప్రచారం అంటూ జగన్ ఫైర్
  • కల్తీ నెయ్యి ట్యాంకర్లు లోపలికి వెళ్లాయా అని సూటి ప్రశ్న
  • కఠిన తనిఖీల తర్వాతే టీటీడీలోకి నెయ్యి ట్యాంకర్లు అనుమతిస్తారని వెల్లడి
  • దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శ
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. దీనిని పూర్తిగా దుష్ప్రచారంగా అభివర్ణించిన ఆయన, దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారుచేసే పోటులోకి వెళ్లాయా? అందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?" అని సూటిగా ప్రశ్నించారు. టీటీడీలోకి వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్‌ను కఠినమైన తనిఖీలకు గురిచేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఏబీఎల్ సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ, టీటీడీ సొంత ల్యాబ్‌లో కూడా పరీక్షలు పాస్ అయితేనే ఆ నెయ్యిని వినియోగానికి స్వీకరిస్తారని వివరించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించని ట్యాంకర్లను వెనక్కి పంపడం ఒక సాధారణ ప్రక్రియ అని జగన్ తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో 17 సార్లు, తమ ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిప్పి పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇంతటి పటిష్టమైన భద్రతా, నాణ్యతా ప్రమాణాలు అమల్లో ఉండగా కల్తీ జరిగిందని ఎలా అంటారని నిలదీశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పవిత్రమైన ప్రసాదంపై ఆరోపణలు చేస్తున్నారని జగన్ అన్నారు.
Jagan Mohan Reddy
Chandrababu Naidu
Tirumala
TTD
Ladoo Prasadam
Adulteration Allegations
Political Allegations
Andhra Pradesh Politics
Quality Control
NABL Certification

More Telugu News