Hardik Pandya: హార్దిక్ పాండ్యా క్రేజ్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్‌ తాకిడితో మ్యాచ్ వేదికనే మార్చేశారు!

Hardik Pandya mania forces venue shift for Baroda Gujarat SMAT match
  • హార్దిక్ పాండ్యా కోసం వెల్లువెత్తిన అభిమానులు
  • భద్రతా కారణాలతో దేశవాళీ మ్యాచ్ వేదిక మార్పు
  • జింఖానా గ్రౌండ్ నుంచి రాజీవ్ గాంధీ స్టేడియానికి తరలింపు
  • గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన హార్దిక్ సర్‌
  • గత మ్యాచ్‌లో పిచ్‌పైకి దూసుకొచ్చిన ఫ్యాన్స్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టమైంది. పాండ్యా పునరాగమనంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బరోడా-గుజరాత్ మధ్య హైదరాబాదులో జరగాల్సిన మ్యాచ్ వేదికను నిర్వాహకులు మార్చాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను జింఖానా గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే రాజీవ్ గాంధీ స్టేడియానికి తరలించారు.

గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన హార్దిక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జట్టు హోటళ్లు, ప్రాక్టీస్ నెట్స్, టికెట్ కౌంటర్ల వద్ద జనం ఊహించని రీతిలో గుమిగూడారు. అంతకుముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొందరు అభిమానులు హార్దిక్‌ను కలిసేందుకు పిచ్‌పైకి దూసుకురావడంతో ఆటకు పలుమార్లు అంతరాయం కలిగింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన నిర్వాహకులు, ఆటగాళ్ల భద్రత, మ్యాచ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

"హార్దిక్ పాండ్యాపై అభిమానం నమ్మశక్యంగా లేదు. మా అంచనాలను మించి అభిమానులు వస్తున్నారు. భద్రత, మ్యాచ్ నిర్వహణ సజావుగా సాగేందుకే వేదికను మార్చాం" అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆసియా కప్‌లో గాయపడిన హార్దిక్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరమయ్యాడు. బీసీసీఐ నుంచి అనుమతి పొందిన తర్వాత తన సోదరుడు కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టుతో కలిశాడు.

ఇక, ఇవాళ‌ జరిగిన మ్యాచ్‌లో బరోడా 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. రాజ్ లింబానీ (3/5) రాణించడంతో గుజరాత్‌ను 70 పరుగులకే కట్టడి చేసిన బరోడా, కేవలం 6.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Hardik Pandya
Syed Mushtaq Ali Trophy
Baroda
Gujarat
Rajiv Gandhi Stadium
Cricket
Indian Cricket
Krunal Pandya
Raj Limbani

More Telugu News