Ravi Shastri: కోహ్లీ, రోహిత్‌ల జోలికి రావొద్దు.. రవిశాస్త్రి వార్నింగ్!

Virat Kohli Rohit Sharma Should Not Be Touched Says Ravi Shastri
  • విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో ఆడుకోవద్దని రవిశాస్త్రి హెచ్చరిక
  • వారిద్దరూ వన్డే ఫార్మాట్‌లో దిగ్గజాలని కితాబు
  • కోహ్లీ, రోహిత్‌లు ఫామ్‌లోకి వస్తే చాలామంది కనుమరుగవుతారని కామెంట్
  • సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించే శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారంటున్న‌ విశ్లేషకులు
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై జరుగుతున్న చర్చపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారి కెరీర్‌తో ఆడుకోవాలని చూస్తున్నారంటూ కొందరికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వన్డే ఫార్మాట్‌లో దిగ్గజాలైన కోహ్లీ, రోహిత్‌ల విషయంలో అనవసరంగా తలదూర్చవద్దని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ... "విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో దిగ్గజాలు. అలాంటి స్థాయి ఉన్న ఆటగాళ్లతో మీరు ఆడుకోవద్దు" అని అన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరి స్థానంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో శాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టెస్టులు, టీ20 క్రికెట్ నుంచి ఇప్పటికే వారు రిటైర్ అయిన నేపథ్యంలో వారి ఫిట్‌నెస్‌పై చర్చ జరుగుతోంది.

ఈ ఇబ్బందులు సృష్టిస్తోంది ఎవరని ప్రశ్నించగా, "కొంతమంది చేస్తున్నారు. నేను చెప్పేది అంతే. ఒకవేళ ఆ ఇద్దరి మైండ్ సెట్ కుదురుకుని, సరైన బటన్ నొక్కితే, చుట్టూ ఉన్నవాళ్లంతా కనుమరుగైపోతారు" అని ప్రభాత్ ఖబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి ఘాటుగా సమాధానమిచ్చారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించే శాస్త్రి పరోక్షంగా ఈ హెచ్చరికలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల 2027 ప్రపంచకప్‌కు వారి ఎంపిక కష్టమవుతుందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సూచించగా, రోహిత్ అంగీకరించాడు. మొదట విముఖత చూపిన కోహ్లీ కూడా సెలక్టర్ల ఒత్తిడితో ఆడేందుకు ఒప్పుకున్నాడు.
Ravi Shastri
Virat Kohli
Rohit Sharma
Indian Cricket Team
BCCI
Ajit Agarkar
Vijay Hazare Trophy
2027 World Cup
Team Selection
Cricket

More Telugu News