YS Jagan: రైతుల పరిస్థితి చూస్తుంటే 'సేవ్ ఏపీ' అనాల్సి వస్తోంది: వైఎస్ జగన్

YS Jagan says Save AP needed seeing farmers plight
  • రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న జగన్
  • చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను నీరుగార్చిందని విమర్శ
  • ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు, గిట్టుబాటు ధరపై స్పష్టత లేదని మండిపాటు
రాష్ట్రంలో రైతుల పరిస్థితిని చూస్తుంటే 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అనాల్సిన దుస్థితి నెలకొందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని, పండుగలా ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.

రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమాను ఒక హక్కుగా అందించామని, దీని కింద రూ.7,800 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఉరి వేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. 

రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పడం లేదని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 20,000 ఇస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లలో రూ. 40,000కు బదులుగా కేవలం రూ. 10,000 మాత్రమే ఇచ్చారని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని, దళారులు రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. 

మొంథా తుపాను విషయంలో ప్రభుత్వం హడావుడి చేసిందని, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు వెల్లడిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 
YS Jagan
Andhra Pradesh farmers
AP farmers
Chandrababu Naidu
Agriculture crisis
Free crop insurance
Input subsidy
Minimum support price
Montha cyclone
YSRCP

More Telugu News