Bengaluru Society: బెంగళూరు సొసైటీలో బ్యాచిలర్స్‌కు షాక్.. ఇంటికి అమ్మాయిలు వచ్చారని రూ.5000 ఫైన్

Bengaluru Society Imposes Rs 5000 Fine On Bachelors After Two Girls Stay Overnight
  • ఇద్దరు అమ్మాయిలు రాత్రి బస చేశారని బ్యాచిలర్స్‌కు రూ.5000 జరిమానా
  • బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ వింత నిబంధనపై నెట్టింట చర్చ
  • బ్యాచిలర్స్‌కు మాత్రమే గెస్టులపై ఆంక్షలు.. కుటుంబాలకు మినహాయింపు
  • సొసైటీ తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. చట్టపరంగా వెళ్లాలని సూచనలు
నగరాల్లో నివసించే బ్యాచిలర్స్‌కు ఎదురయ్యే ఇబ్బందులను కళ్లకు కట్టేలా ఓ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఇద్దరు యువతులు రాత్రిపూట తమ ఫ్లాట్‌లో బస చేశారన్న కారణంతో ఓ హౌసింగ్ సొసైటీ ఇద్దరు బ్యాచిలర్స్‌కు ఏకంగా రూ.5,000 జరిమానా విధించింది. ఈ ఘటనపై బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన ఫ్లాట్‌మేట్‌తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. అక్టోబర్ 31, 2025 రాత్రి ఇద్దరు యువతులు వారి ఫ్లాట్‌లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ యాజమాన్యం, నిబంధనలు ఉల్లంఘించారంటూ వారికి రూ.5,000 ఫైన్ వేసింది. దీనికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లో "ఇద్దరు అమ్మాయిలు రాత్రి బస చేశారు" అని స్పష్టంగా పేర్కొంది.

ఈ అన్యాయంపై ఆ యువకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. "మా సొసైటీలో బ్యాచిలర్స్‌ రాత్రిపూట అతిథులను అనుమతించకూడదనే నిబంధన ఉంది. కానీ, ఇదే రూల్ కుటుంబాలకు వర్తించదు. మేం కూడా అందరిలాగే మెయింటెనెన్స్ చెల్లిస్తున్నా మాపై ఈ వివక్ష ఎందుకు? కనీసం ఓ హెచ్చరిక కూడా ఇవ్వకుండా నేరుగా జరిమానా విధించారు" అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది సొసైటీ తీరును తప్పుబడుతూ, వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేయాలని సూచించారు. "ఇది మన దేశంలో ఉన్న సాంస్కృతిక సమస్య" అని ఒకరు వ్యాఖ్యానించగా, "ఇలాంటి నిబంధనలు చట్టవిరుద్ధం, కోర్టుకు వెళ్లవచ్చు" అని మరొకరు సలహా ఇచ్చారు. అయితే, తన ఫ్లాట్‌మేట్ విషయం గమనించకుండా ఇప్పటికే ఆ జరిమానా చెల్లించేశాడని బాధితుడు తెలపడం గమనార్హం. ఈ ఘటనతో నగరాల్లో బ్యాచిలర్స్‌ ఎదుర్కొంటున్న వివక్షపై మరోసారి చర్చ మొదలైంది.


Bengaluru Society
Bachelor fine
Apartment rules
Housing society rules
Discrimination
Apartment guest rules
Bachelor accommodation
Rental rules
Apartment fine
Social media post

More Telugu News