Bhanu Prakash: కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు?.. రివాల్వర్ గుట్టు విప్పని ఎస్సై భాను ప్రకాశ్

Hyderabad SI Bhanu Prakash in Trouble Over Missing Revolver
  • విచారణకు సహకరించని సస్పెండెడ్ ఎస్సై భానుప్రకాశ్
  • ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై కోటికి పైగా అప్పులు
  • కనిపించకుండా పోయిన సర్వీస్ రివాల్వర్
  • డబ్బు కోసమే తుపాకీ తాకట్టు పెట్టారని అనుమానాలు
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై, నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి సస్పెండైన అంబర్‌పేట డిటెక్టివ్ ఎస్సై (డీఎస్సై) భానుప్రకాశ్‌ రెడ్డి వ్యవహారం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. అప్పుల కోసం ఏకంగా తన సర్వీస్ రివాల్వర్‌నే ఆయన తాకట్టు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు ఆయన సహకరించకపోవడం, రివాల్వర్ కనిపించడంలేదని చెప్పడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారని సీనియర్ అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటికి చెందిన భానుప్రకాశ్‌ 2020 బ్యాచ్ ఎస్సైగా ఎంపికై, గతేడాది అంబర్‌పేటలో డీఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఉద్యోగంలో చేరినప్పటి నుంచే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి, అధిక వడ్డీలకు అప్పులు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్లలో ఆయన అప్పులు రూ. కోటి దాటినట్లు విచారణలో తేలింది. కొడుకు చేసిన అప్పులు తీర్చేందుకు ఆయన తల్లి వ్యవసాయ భూమి అమ్మి రూ. 45 లక్షలు చెల్లించినా, భానుప్రకాశ్‌ తన పద్ధతి మార్చుకోలేదు. జీతం సరిపోక తోటి సిబ్బంది వద్ద కూడా అప్పులు చేసినట్లు తెలిసింది.

ఇటీవల ఏపీలో గ్రూప్-2 ఉద్యోగం సాధించడంతో, ఎస్సై ఉద్యోగం నుంచి రిలీవ్ అయ్యే క్రమంలో అధికారులు సర్వీస్ రివాల్వర్‌ను అప్పగించాలని కోరారు. అయితే, అది కనిపించడం లేదని భానుప్రకాశ్‌ చెప్పడంతో ఆయన బెట్టింగ్ వ్యవహారం మొత్తం బయటపడింది. బుల్లెట్లు తన వద్దే ఉన్నాయని చెబుతున్నా, రివాల్వర్ గురించి మాత్రం నిజం చెప్పడం లేదని అధికారులు భావిస్తున్నారు. డబ్బు అవసరంతోనే ఆయన రివాల్వర్‌ను తాకట్టు పెట్టి ఉంటారని ఉన్నతాధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. స్టేషన్‌కు వచ్చిన నిందితుల్లో ఎవరైనా చోరీ చేశారా అనే కోణంలో విచారించినా ఆధారాలు లభించలేదు. దీంతో కావాలనే భానుప్రకాశ్‌ నిజం దాచిపెడుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
Bhanu Prakash
Amberpet
DSSI
online betting
service revolver
loan
Hyderabad police
Andhra Pradesh
crime

More Telugu News