Pawan Kalyan: గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan Slams Previous Government for Wasting Public Funds
  • ఉప్పాడ మత్స్యకారులతో పవన్ కల్యాణ్ సమావేశం 
  • అధ్యయనానికి 60 మంది మత్స్య కారులను కేరళ, తమిళనాడుకు పంపుతున్నట్లు వెల్లడి 
  • సముద్రపు నాచు సేద్యం, కృత్రిమ పగడపు దిబ్బల ఏర్పాటుకు ప్రణాళికలు
  • ఉప్పాడ తీరంలో కాలుష్యంపై శాస్త్రీయ అధ్యయనానికి నిపుణుల బృందం ఏర్పాటు
ప్రజాధనం నుంచి వెచ్చించే ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం వృథా అయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పోలవరం డయాఫ్రం వాల్, ఉప్పాడ మత్స్యకార జెట్టీ నిర్మాణాల్లోని లోపాలే ఇందుకు నిదర్శనమని అన్నారు.

మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న ఉప్పాడ మత్స్యకారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. '100 రోజుల ప్రణాళిక అమలు, భవిష్యత్ కార్యాచరణ'పై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం డయాఫ్రం వాల్‌ను గత ప్రభుత్వం నాశనం చేసింది. ఇప్పుడు దాన్ని పునర్నిర్మించాల్సి వస్తోంది. అలాగే, డిజైన్ లోపంతో ఉప్పాడ జెట్టీ నిరుపయోగంగా మారింది. దాని మరమ్మతులకు మళ్లీ రూ.80 కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి కల్పించారు. చేసిన పనికే మళ్లీమళ్లీ డబ్బు ఖర్చుపెట్టేలా వారి పాలన సాగింది" అని విమర్శించారు.

మత్స్యకారుల సమస్యను తన సమస్యగా భావిస్తానని, అక్టోబరు 9న ఉప్పాడలో ఇచ్చిన మాటపై కట్టుబడి ఉన్నానని పవన్ పునరుద్ఘాటించారు. వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్‌ను ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విజయవంతమైన సముద్ర ఉత్పత్తుల విధానాలను అధ్యయనం చేసేందుకు ఉప్పాడ నుంచి 60 మంది మత్స్యకారులతో కూడిన బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు.

ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్యపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం చూపేందుకు ఐసీఏఆర్ శాస్త్రవేత్త డాక్టర్ జో కిజాకుడాన్ బృందం పనిచేస్తుందని వెల్లడించారు. సముద్రపు నాచు సేద్యం, కృత్రిమ పగడపు దిబ్బల ఏర్పాటు ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయ మార్గాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మత్స్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Pawan Kalyan
Andhra Pradesh
AP Deputy CM
Uppada fishermen
Polavaram project
Public funds
Waste of public money
Reverse tendering
Fisheries development
ICAR

More Telugu News