Gurava Reddy: హైదరాబాద్ రోడ్లపై యమధర్మరాజు.. హెల్మెట్ లేనివారికి హెచ్చరిక.. వీడియో ఇదిగో!

Gurava Reddy Yama Dharma Raju on Hyderabad Roads Warns Against No Helmet
  • హైదరాబాద్‌లో యమధర్మరాజుతో వినూత్న రోడ్డు భద్రతా కార్యక్రమం
  • హెల్మెట్ లేని వాహనదారులను నేరుగా హెచ్చరించిన యముడు
  • సర్వేజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఈ ప్రచారం
  • నగరంలోని 365 ప్రధాన జంక్షన్లలో అవగాహన కల్పించడమే లక్ష్యం
హైదరాబాద్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సర్వేజనా ఫౌండేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుధవారం రద్దీగా ఉండే రసూల్‌పుర చౌరస్తాలో యమధర్మరాజు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు.

రసూల్‌పుర సిగ్నల్ వద్ద వాహనాలు ఆగిన సమయంలో, యముడి వేషధారణలో ఉన్న వ్యక్తి చేతిలో గద, పాశం పట్టుకుని హెల్మెట్ లేని ఓ ద్విచక్ర వాహనదారుడి వద్దకు వెళ్లారు. "హెల్మెట్ ధరించకపోతే ప్రమాదం జరిగినప్పుడు నేనే వచ్చి నీ ప్రాణం తీసుకెళ్తా" అని హెచ్చరించారు. "ఒక తల పోతే ఇంకో తల రాదు" అంటూ ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కొత్త తరహా విధానం ప్రజల్లో మార్పు తీసుకువస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం గురించి సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. నగరంలోని 365 ప్రధాన జంక్షన్లను ఎంపిక చేసి, ఏడాది పొడవునా ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి బి. జనార్దన్‌రెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Gurava Reddy
Hyderabad
Road Safety
Yama Dharma Raju
Traffic Awareness
Helmet Safety
Rasoolpura
Sarvejana Foundation
B Janardhan Reddy
Road Accidents

More Telugu News