Ramakrishnaiah: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరం.. సర్పంచ్ ఎన్నికల్లో తండ్రీకొడుకుల మధ్య పోటీ!

Ramakrishnaiah Father Son Contest Sarpanch Election in Telangana
  • ఝాన్సిలింగాపూర్ గ్రామంలో పోటీ పడుతున్న తండ్రీకొడుకులు
  • నామినేషన్ దాఖలు చేసిన తండ్రి రామకృష్ణయ్య, కొడుకు వెంకటేశ్
  • సర్పంచ్ పదవికి గ్రామంలో 10 నామినేషన్లు దాఖలు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులను వేలం వేస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఈ వేలం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో బంధువులు, స్నేహితులు పోటీ పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సిలింగాపుర్ గ్రామంలో తండ్రీకొడుకులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఝాన్సిలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మానెగళ్ల రామకృష్ణయ్య, కుమారుడు వెంకటేశ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ గ్రామంలో 1,563 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానానికి మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి.

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. వేలం వేయగా సర్పంచ్ పదవిని రూ. 73 లక్షలకు మహమ్మద్ సమీనా ఖాసీమ్ అనే మహిళ దక్కించుకున్నారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోనూ వేలం పాటలో ఒక వ్యక్తి సర్పంచ్ పదవిని దక్కించుకోగా, గ్రామస్తులు కొందరు సర్పంచ్ వేలంపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని బైండోవర్ చేసినట్లు తహసీల్దారు తెలిపారు.
Ramakrishnaiah
Telangana Panchayat Elections
Sarpanch Elections
Jhansi Lingapur

More Telugu News