Revanth Reddy: హిందూ దేవుళ్ల మీద చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Responds to Criticism on Hindu Gods Remarks
  • ఉత్తరాదిన బీజేపీ నన్ను పాప్యులర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్న సీఎం
  • తన నేతృత్వంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు ఉంటుందని వ్యాఖ్య
  • హిందూ దేవుళ్ళ మీద చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంపై స్పందన
  • హిందూ మతం వంటిదే కాంగ్రెస్ అని చెప్పే క్రమంలో చెప్పినట్లు వెల్లడి
ఉత్తర భారతదేశంలో బీజేపీ తనను పాప్యులర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన నేతృత్వంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ సమాజం వంటిదే కాంగ్రెస్ పార్టీ అని అంతర్గతంగా జరిగిన కార్యక్రమంలో తాను పేర్కొన్నానని ఆయన అన్నారు. పార్టీ నేతగా ఎలా పని చేయాలనే అంశాన్ని వివరిస్తున్న క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఆ ఆవేదనతోనే తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన అంశాలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హిందూ మతంలో కోట్లాది మంది దేవతలు ఉన్నారని, వివాహం కానివారికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునేవారికి మరొక దేవుడు, మద్యపానం చేసేవారికి ఇంకొక దేవుడు ఉన్నారని, అదేవిధంగా మల్లమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారని డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కల్లు పోసి, కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పన్నం తినేవారికి సైతం ఒక దేవుడు ఉన్నారని, మనకు అన్ని రకాల దేవుళ్లు ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy
Telangana CM
Hindu Gods Remark
BJP Criticism
DCC Presidents Meeting
Controversy

More Telugu News