Vladimir Putin: నల్ల సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తత... ఉక్రెయిన్ కు పుతిన్ సీరియస్ వార్నింగ్

Vladimir Putin Warns Ukraine Over Black Sea Attacks
  • నల్ల సముద్రంలో రష్యా ట్యాంకర్లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
  • దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు పుతిన్
  • ఉక్రెయిన్‌కు సముద్ర మార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరిక
నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేయడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు ముగింపు పలకాలంటే ఉక్రెయిన్‌కు సముద్రంతో సంబంధాలు లేకుండా చేయడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. టెలివిజన్‌లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్, ఈ పైరసీ దాడులను (సముద్రపు దాడులు)  అరికట్టడానికి కఠిన చర్యలు తప్పవని ఉక్రెయిన్‌ను హెచ్చరించారు.

అయితే, ఉక్రెయిన్‌కు సముద్ర మార్గాన్ని ఏ విధంగా మూసివేయనున్నారనే వివరాలను పుతిన్ వెల్లడించలేదు. ఉక్రెయిన్ నౌకలపై దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని, కీవ్‌కు సాయం చేస్తున్న దేశాల ట్యాంకర్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకున్నప్పటికీ, ఒడెస్సా వంటి కీలకమైన పోర్టులు ఇంకా కీవ్ నియంత్రణలోనే ఉన్నాయి.

మంగళవారం తుర్కియే తీరంలో రష్యా జెండాతో వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. గత శనివారం కూడా రెండు రష్యన్ ట్యాంకర్లను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. రష్యా పోర్టుల నుంచి చమురు రవాణా చేస్తున్న ఈ "షాడో ఫ్లీట్" నౌకల ద్వారానే యుద్ధానికి అవసరమైన నిధులు భారీగా సమకూరుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ నుంచి ఈ తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. 
Vladimir Putin
Russia
Ukraine
Black Sea
Oil Tanker
Drone Attack
War
Odesa
Turkey

More Telugu News