Gautam Gambhir: టీమిండియాలో ముసలం.. గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌కు కోల్డ్ వార్?

Gautam Gambhir Cold War with Kohli and Rohit in Team India
  • కోచ్ గంభీర్‌తో కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు
  • సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై నెలకొన్న గందరగోళం
  • కోహ్లీతో చర్చలకు మధ్యవర్తిగా వెళ్లిన సెలెక్టర్ ప్రగ్యాన్ ఓఝా
  • ఎయిర్‌పోర్ట్‌లో వీరి చర్చల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న వేళ, వారిద్దరికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే వార్తలు కలకలం రేపుతున్నాయి. జట్టులో అంతర్గత విభేదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2027 ప్రపంచకప్ వరకు వీరిద్దరినీ జట్టులో కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై అనిశ్చితి నెలకొన్న సమయంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ వదంతులకు బలం చేకూరుస్తూ బుధవారం రాయ్‌పూర్‌లో రెండో వన్డేకు ముందు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. విరాట్ కోహ్లీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే, ‘పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో’ ఈ భేటీకి అగార్కర్ బదులుగా మరో సెలక్టర్, ప్రగ్యాన్ ఓఝాను మధ్యవర్తిగా పంపినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌లో ఓఝా, కోహ్లీ మధ్య తీవ్రమైన చర్చ జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అదే సమయంలో, గంభీర్ పక్కన కూర్చుని రోహిత్ శర్మతో ఓఝా మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ చర్చలో కోహ్లీ లేకపోవడం గమనార్హం. ఈ పరిణామాలు జట్టులో ఏదో జరుగుతోందన్న అనుమానాలను మరింత పెంచుతున్నాయి.

గంభీర్ ఎప్పుడూ 'సూపర్ స్టార్' సంస్కృతి కంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టంగా చెబుతాడు. ఆయన కఠినమైన వైఖరి, సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ గ్యాప్‌కు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక టెస్టుల్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీసీసీఐ కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. కాగా, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ అర్ధసెంచరీతో, కోహ్లీ తన 52వ సెంచరీతో అద్భుతమైన ఫామ్‌లో ఉండటం విశేషం.
Gautam Gambhir
Virat Kohli
Rohit Sharma
Team India
BCCI
Ajit Agarkar
Pragyan Ojha
Indian Cricket Team
World Cup 2027
Team Selection

More Telugu News