Uttar Pradesh Bride: పెళ్లయి అత్తారింటికి వెళ్లిన 20 నిమిషాలకే విడాకులిచ్చిన నవ వధువు

Uttar Pradesh Bride Files for Divorce 20 Minutes After Wedding
  • వారి ప్రవర్తన సరిగా లేదంటూ పెళ్లి రద్దుకు పట్టుబట్టిన నవ వధువు
  • ఐదు గంటల పంచాయితీ తర్వాత విడిపోయిన ఇరు కుటుంబాలు
  • ఒకరికొకరు బహుమతులు తిరిగి ఇచ్చేసుకుని బంధానికి ముగింపు
ఉత్తరప్రదేశ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు, అత్తారింట్లో అడుగుపెట్టిన కేవలం 20 నిమిషాలకే వారి ప్రవర్తన నచ్చలేదంటూ ఆ బంధాన్ని తెంచుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

‘భాస్కర్ ఇంగ్లిష్’ కథనం ప్రకారం.. డియోరియా జిల్లాలో నవంబర్ 25న ఓ జంటకు ఘనంగా వివాహం జరిగింది. జైమాల, ద్వార పూజ వంటి అన్ని సంప్రదాయాలు సక్రమంగా జరిగాయి. నవంబర్ 26న వధువు అత్తారింటికి చేరుకుంది. బంధువులు, స్థానికుల సమక్షంలో ‘దుల్హా చెహ్రా దిఖాయీ’ (వరుడి ముఖం చూపించే) కార్యక్రమం నిర్వహిస్తుండగా, వధువు ఒక్కసారిగా ఆ వేడుకను ఆపేసింది. వెంటనే తన తల్లిదండ్రులను పిలవాలని పట్టుబట్టింది.

భర్త, అత్తమామలు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. కాసేపటికే అక్కడికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అత్తవారి ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదని, వారితో కలిసి ఉండలేనని ఆమె తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

విషయం స్థానిక పంచాయితీకి చేరింది. సుమారు ఐదు గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత, ఇరుపక్షాల అంగీకారంతో వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పెళ్లి సమయంలో ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు, వస్తువులను తిరిగి ఇచ్చేసుకున్నారు. అనంతరం వధువు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ‘డయల్ 112’కు సమాచారం అందినా, ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. "పంచాయతీలోనే ఇరు వర్గాలు సామరస్యంగా విడిపోయాయి" అని భలువానీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ప్రదీప్ పాండే ధ్రువీకరించారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "కొన్నేళ్లు సర్దుకుపోయి జీవితాలు నాశనం చేసుకునే కన్నా ఇది మంచి నిర్ణయం" అని కొందరు సమర్థిస్తుండగా, "పెళ్లిని ఒక అపహాస్యం చేశారు, ఆమె కుటుంబానికి జరిమానా విధించాలి" అని మరికొందరు విమర్శిస్తున్నారు.
Uttar Pradesh Bride
bride
divorce
Uttar Pradesh
arranged marriage
Indian wedding
wedding ceremony
family dispute
local panchayat
dowry

More Telugu News