Robin Smith: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ కన్నుమూత

Robin Smith England Cricketer Dies at 62
  • ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో సోమవారం ఆకస్మికంగా మృతి చెందిన స్మిత్
  • ఫాస్ట్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న బ్యాటర్‌గా గుర్తింపు
  • ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులు, 71 వన్డేలకు ప్రాతినిధ్యం
  •  స్మిత్ మృతికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, హాంప్‌షైర్ సంతాపం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాటర్ రాబిన్ స్మిత్ (62) కన్నుమూశాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఆయన ఆకస్మికంగా మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫాస్ట్ బౌలింగ్‌ను అత్యంత సమర్థంగా ఎదుర్కొనే కొద్దిమంది ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఒకరిగా రాబిన్ స్మిత్ కు పేరుంది. అభిమానులు అతడిని ముద్దుగా 'ది జడ్జ్' అని పిలుచుకుంటారు.

దక్షిణాఫ్రికాలో జన్మించిన రాబిన్ స్మిత్, ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులు, 71 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 43.67 సగటుతో 9 సెంచరీలు సహా 4,236 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 6,500కు పైగా పరుగులు సాధించాడు. 1992 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టులో స్మిత్ కీలక సభ్యుడు. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘకాలం హాంప్‌షైర్ కౌంటీకి ఆడి, 30,000కు పైగా పరుగులు సాధించాడు.

రాబిన్ స్మిత్ మరణ వార్తను ఆయన కుటుంబం ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఇది తమకు అత్యంత బాధాకరమైన సమయమని, తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరింది. గతంలో రాబిన్ స్మిత్ మానసిక రుగ్మతలు, మద్యపానం వంటి సమస్యలతో పోరాడినప్పటికీ, వాటి ఆధారంగా మరణానికి గల కారణాలపై ఊహాగానాలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. పోస్ట్‌మార్టం తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని స్పష్టం చేసింది.

స్మిత్ మృతి పట్ల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), హాంప్‌షైర్ కౌంటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను చిరునవ్వుతో ఎదుర్కొన్న ధైర్యశాలి రాబిన్ స్మిత్ అని ఈసీబీ ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు.
Robin Smith
England cricketer
cricket
death
obituary
England cricket team
Hampshire county
1992 World Cup
Richard Thompson
The Judge

More Telugu News