Janhvi Kapoor: మరణాలను మీమ్స్‌గా మార్చడం పాపం: జాన్వీ కపూర్ ఆవేదన

Janhvi Kapoor Condemns Trolling and Memes on Deaths
  • సెలబ్రిటీల మరణాలను మీమ్స్‌గా మార్చడంపై జాన్వీ కపూర్ ఆవేదన
  • అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే భయపడ్డానన్న జాన్వీ
  • దిగజారుతున్న మీడియా, సోషల్ మీడియా సంస్కృతిపై ఆందోళన
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో నెలకొన్న ఓ దారుణమైన ధోరణిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖుల మరణాలను సైతం వినోదం కోసం మీమ్స్‌గా మార్చే సంస్కృతిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ తీరు మానవ నైతికతను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

తన తల్లి శ్రీదేవి మరణం గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతీసారి ఎంతో జాగ్రత్తగా ఉంటానని జాన్వీ తెలిపారు. "అమ్మ మరణాన్ని అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ సంపాదించుకోవాలని చూస్తున్నానని ప్రజలు అనుకుంటారేమోనన్న భయంతో చాలాసార్లు ఆ విషయంపై మాట్లాడటానికే వెనుకాడాను. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ, భావోద్వేగాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. వాటిని మాటల్లో చెప్పలేను" అని ఆమె తన ఆవేదనను పంచుకున్నారు.

ప్రస్తుత జర్నలిజం, సోషల్ మీడియా తీరు ప్రమాదకరంగా మారుతోందని జాన్వీ అన్నారు. "ఇటీవల ధర్మేంద్ర గారు చనిపోయారంటూ వదంతులు సృష్టించి, దానిపైనా మీమ్స్ చేశారు. ఒకరి మరణాన్ని మీమ్‌గా మార్చడం ఎంతో పాపం. ఈ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది" అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ విషాదం జరిగిన కొద్ది నెలలకే జాన్వీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న తమ కుటుంబాన్ని మీడియా ప్రశ్నలు, సోషల్ మీడియా మీమ్స్ మరింత వేదనకు గురిచేశాయని ఆమె గుర్తుచేసుకున్నారు.
Janhvi Kapoor
Sridevi
Dharmendra
Bollywood
Social Media
Memes
Death
Mumbai
Journalism
Moral Ethics

More Telugu News