Employee: నానమ్మ ఐసీయూలో ఉందని చెప్పినా వినిపించుకోని బాస్.. ఉద్యోగి ఏం చేశాడంటే..!

Employee leaves office for sick grandmother faces boss wrath
  • జీతం కట్ చేయాలంటూ హెచ్చార్ కు ఆదేశాలు
  • గతంలో తాను 16 గంటల పాటు వర్క్ చేశానని ఉద్యోగి మెయిల్
  • ఇకపై ఆఫీసు సమయానికి మించి పనిచేయబోనని చెప్పిన ఉద్యోగి
నానమ్మకు సీరియస్ గా ఉందని ఫోన్ రావడంతో ఆఫీసు నుంచి వెళ్లిపోయిన ఓ ఉద్యోగిపై బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్లైంట్ తో మీటింగ్ కు హాజరుకాలేదని మండిపడ్డాడు. హెచ్చార్ సిబ్బందికి ఫోన్ చేసి జీతంలో కోత పెట్టాలని ఆదేశించాడు. తాను చెప్పేది వినకుండా అరుస్తున్న బాస్ తీరుతో తీవ్ర అసహనానికి గురైన సదరు ఉద్యోగి ఇకపై తాను ఆఫీసు సమయం తర్వాత అదనంగా పనిచేయబోనని స్పష్టం చేశాడు. ఆ మేరకు హెచ్చార్ కు మెయిల్ పంపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఉద్యోగి తన రెడ్డిట్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే..
ఆఫీసులో పనిచేస్తుండగా నానమ్మకు అనారోగ్యంగా ఉందని ఫోన్ రావడంతో ఓ ఉద్యోగి తన బాస్ అనుమతికోసం ప్రయత్నించాడు. బాస్ అందుబాటులో లేకపోవడంతో తోటి ఉద్యోగులకు చెప్పి బాస్ కు సమాచారం అందించాలని హడావుడిగా వెళ్లిపోయాడు. నానమ్మను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగి రాత్రి 9 గంటలకు నిర్ణయించిన మీటింగ్ కు హాజరు కాలేకపోయాడు. దీంతో బాస్ ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్లైంట్ తో మీటింగ్ కు హాజరుకాకపోవడంతో ఆ రోజు వేతనం కోత పెట్టాలని హెచ్చార్ ను ఆదేశించాడు.

తన పరిస్థితి అర్థం చేసుకోకుండా బాస్ అరవడంతో ఉద్యోగికి చిర్రెత్తుకొచ్చింది. తాను కూడా హెచ్చార్ కు మెయిల్ చేస్తూ.. నవంబర్ 27న ఉదయం 11 గంటల నుంచి తెల్లవారు జామున 3.30 గంటల వరకు 16.5 గంటల పాటు పనిచేశానని గుర్తుచేశారు. ఆ రోజు అదనంగా చేసిన పనికి ఓవర్ టైమ్ చొప్పున వేతనం చెల్లిస్తారా? అని అడిగాడు. ఒకవేళ్ చెల్లించలేకపోతే ఇకపై తాను ఆఫీసు పనిగంటలకు మించి అదనంగా పనిచేయబోనని తెగేసి చెప్పాడు. ఉద్యోగంలో చేరిన సమయంలో బాండ్ రాసిచ్చిన కారణంగా రాజీనామా చేయలేకపోతున్నానని, లేకపోతే వెంటనే ఉద్యోగం వదిలివేసేవాడినని మెయిల్ లో పేర్కొన్నాడు.
Employee
Boss
ICU
Grandmother
Meeting
HR
Overtime
Reddit
Viral

More Telugu News