Bengal Voters List: బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 43 లక్షల మంది ఔట్!

ECI to delete 43 lakh names from electoral rolls in Bengal
  • చనిపోయిన, వలస వెళ్లిన ఓటర్లే అత్యధికం
  • 2,208 పోలింగ్ బూత్‌లలో ఒక్క మృత ఓటరూ లేరన్న ఈసీ
  • ఈసీ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ
  • ఫారాల నమోదుపై ఆడిట్ కోరిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. బూత్-స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) సేకరించిన ఫారాల డిజిటైజేషన్ సరళిని బట్టి, సుమారు 43.30 లక్షల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించనున్నట్లు ఈసీఐ అంచనా వేసింది. ఈ ముసాయిదా జాబితాను ఈ నెల‌ 16న ప్రచురించనున్నారు.

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాల ప్రకారం సోమవారం సాయంత్రం వరకు జరిగిన డిజిటైజేషన్ ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 27 నాటికి బెంగాల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,66,37,529గా ఉంది. తొలగించనున్న 43.30 లక్షల పేర్లలో అత్యధికంగా 21.45 లక్షల మంది మరణించిన ఓటర్లు ఉన్నారు. సుమారు 15.10 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కాగా, 5.5 లక్షల మంది ఆచూకీ లభించని వారుగా గుర్తించారు. బోగస్ లేదా నకిలీ ఓటర్ల సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది.

అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ
అయితే, రాష్ట్రంలోని 2,208 పోలింగ్ బూత్‌లలో మరణించిన, నకిలీ లేదా వలస వెళ్లిన ఓటరు ఒక్కరూ లేరని గుర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్ని బూత్‌లలో ఒక్క లోపం కూడా లేకపోవడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ బూత్‌ల నుంచి సేకరించిన ఫారాలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది.

ఈ అంశంపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందించారు. నవంబర్ 26, 27, 28 తేదీల్లో కేవలం మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1.25 కోట్ల ఫారాలు నమోదు కావడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ మూడు రోజుల్లో నమోదైన ఫారాలపై ఆడిట్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయంగానూ వేడెక్కింది.
Bengal Voters List
West Bengal Voters List
Election Commission of India
Suvendu Adhikari
West Bengal Election
Fake Voters
Voter List Audit
Bengal Politics
BJP
Voter Deletion

More Telugu News