Anil Chokhra: ఏపీ లిక్కర్ స్కామ్ సొమ్ముతో ముంబైలో బంగారం.. సిట్ విచారణలో గుట్టు విప్పిన నిందితుడు అనిల్ చోఖ్రా

AP Liquor Scam Anil Chokhra Admits to Laundering Money into Gold in Mumbai
  • సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడి
  • ముడుపుల సొమ్మును ముంబైలో బంగారం, నగదుగా మార్చినట్టు నిందితుడి అంగీకారం
  • షెల్ కంపెనీల ద్వారా రూ.78 కోట్లు దారి మళ్లించినట్లు వెల్లడి
  • దుబాయ్ లింకులతో నల్లధనాన్ని వైట్‌గా మార్చినట్లు తెలిపిన అనిల్ చోఖ్రా
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక రహస్యాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఏ-49వ నిందితుడిగా ఉన్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రా, సిట్ విచారణలో ముడుపుల సొమ్మును ఎలా దారి మళ్లించిందీ వివరించినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (ఏ-1)కి చెందిన బినామీ డిస్టిలరీల నుంచి వచ్చిన రూ.78 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బంగారం, నగదు రూపంలోకి మార్చినట్లు చోఖ్రా అంగీకరించినట్టు సమాచారం.

సిట్ విచారణలో చోఖ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఊరూపేరూ లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి ముంబైలో 30కి పైగా షెల్ కంపెనీలను సృష్టించారు. ఆదాన్, లీలా, ఎస్‌పీవై ఆగ్రోస్ వంటి డిస్టిలరీల నుంచి వచ్చిన డబ్బును ఈ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఆ తర్వాత ముంబైలోని చాముండ బులియన్స్ యజమాని చేతన్ కుమార్, ఇతర గోల్డ్ డీలర్ల సిండికేట్ ద్వారా ఆ సొమ్ముతో బంగారం కొనుగోలు చేశారు. చివరిగా, దుబాయ్‌లో ఉన్న చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక నెట్‌వర్క్‌ను ఉపయోగించి మొత్తం నల్లధనాన్ని వైట్‌గా మార్చినట్లు చోఖ్రా వివరించినట్టు తెలిసింది.

వైసీపీ ప్రభుత్వంలో సుమారు రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జగన్ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 13 మందిని సిట్ అరెస్ట్ చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లో జప్తు చేసింది. ప్రస్తుతం ఒడిశా, హైదరాబాద్‌లలోనూ మరిన్ని ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తోంది. చోఖ్రాను మరో రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు.
Anil Chokhra
AP Liquor Scam
Andhra Pradesh
YS Jagan
Raj Kasireddy
Money Laundering
Gold
Mumbai
SIT Investigation
Excise Policy

More Telugu News