Ditwa Cyclone: 'దిత్వా' తుపాన్‌ అప్‌డేట్.. ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

Ditwa Cyclone Weakens Heavy Rains Forecast for Andhra Pradesh
  • చెన్నై సమీపంలో తీరానికి సమాంతరంగా ప్రయాణం
  • నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • కోస్తా, రాయలసీమలో మరో రెండు రోజులు వర్ష సూచన
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక
'దిత్వా' తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమాంతరంగా నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం గంటకు సగటున 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, మరో రెండు రోజుల పాటు ఉత్తర దిశగా కదిలి చెన్నైకి సమీపంలో తీరం దాటడం లేదా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరానికి దగ్గరగా ప్రయాణించడం, పొడి గాలులు దీనివైపు వీయడం వల్లే తుఫాను బలహీనపడిందని ఇస్రో నిపుణులు తెలిపారు.

ఈ వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల, మధ్య, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ సోమవారం వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావిత కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రానున్న 24 గంటల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం రేవుల్లో 3వ నంబర్, మిగిలిన రేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
Ditwa Cyclone
Andhra Pradesh Rains
AP Weather
Cyclone Alert
Bay of Bengal Cyclone
Rayalaseema Weather
Coastal Andhra
IMD Forecast
Heavy Rainfall Warning
Weather Update

More Telugu News