Devji: దేవ్‌జీని కోర్టులో ప్రవేశపెట్టేలా చూడండి.. పవన్‌ కల్యాణ్‌కు మావోయిస్టు నేత కుటుంబం విజ్ఞప్తి

Devji Court Appearance Plea to Pawan Kalyan by Maoist Leader Family
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎక్స్‌లో లేఖ రాసిన దేవ్‌జీ సోదరుడి కుమార్తె సుమ
  • కోర్టులో హజరుపరచాలి లేదా లొంగిపోవడానికి అవకాశం కల్పించాలన్న సుమ   
  • 40 ఏళ్లుగా ఆయన కోసం ఎదురుచూస్తున్నామని లేఖలో ఆవేదన
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని కోర్టులో హాజరుపరచాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవ్‌జీ తమ్ముడి కుమార్తె సుమ ‘ఎక్స్’ వేదికగా పవన్‌కు ఒక బహిరంగ లేఖను పోస్ట్ చేశారు.  
 
"మా పెద్దనాన్న దేవ్‌జీ పోలీసుల కస్టడీలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారం నిజమో కాదో తెలియక మా కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరిచేలా చూడండి లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వండి" అని సుమ తన లేఖలో అభ్యర్థించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తమ కుటుంబం గత 40 ఏళ్లుగా ఆయన కోసం ఎదురుచూస్తూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
"మీపై మాకు చాలా నమ్మకం ఉంది. ఒక అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. మా కుటుంబానికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాం" అంటూ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి సుమ తన లేఖలో పేర్కొన్నారు. దేవ్‌జీ ఆచూకీపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల అభ్యర్థన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Devji
Tippiri Tirupathi
Pawan Kalyan
Maoist leader
Andhra Pradesh
Janasena
Naxalite
Court appearance
Missing Maoist
Korutla

More Telugu News