Mohan Yadav: సామూహిక వివాహ వేడుకలో తాళి కట్టిన సీఎం కొడుకు.. నిరాడంబర వివాహం చేసిన మధ్యప్రదేశ్ సీఎం

Mohan Yadav Sons Simple Wedding with 21 Couples
  • సామూహిక వివాహ వేడుకలో మధ్యప్రదేశ్ సీఎం కుమారుడి పెళ్లి
  • 21 జంటలతో కలిసి ఏడడుగులు నడిచిన సీఎం తనయుడు అభిమన్యు
  • ఆదర్శంగా నిలిచారంటూ సీఎంను ప్రశంసించిన రాందేవ్‌ బాబా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా, సామాజిక బాధ్యతతో జరిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉజ్జయినిలో శనివారం జరిగిన ఒక సామూహిక వివాహ వేడుకలో మరో 21 జంటలతో పాటు తన చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ వివాహాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అభిమన్యు.. డాక్టర్ ఇషిత మెడలో మూడు ముళ్లు వేశారు.

సుమారు 25,000 మంది అతిథులు హాజరైన ఈ వేడుకను భారీ ఎత్తున ఏర్పాటు చేసినా, ఆడంబర ప్రదర్శనకు బదులుగా సామాజిక సమానత్వానికి పెద్దపీట వేశారు. వేర్వేరు సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన 22 జంటలు ఒకే వేదికపై ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మా కుమారుడు అభిమన్యు, కోడలు ఇషితతో పాటు మరో 21 జంటలు ఈ పవిత్ర వేడుకలో ఒక్కటయ్యాయి. సనాతన సంస్కృతి, సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.

యోగా గురు రాందేవ్‌ బాబా ఈ జంటలన్నింటికీ వేదమంత్రాల సాక్షిగా వివాహ క్రతువును జరిపించారు. ఇలాంటి గొప్ప ఆదర్శాన్ని ప్రదర్శించిన తొలి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అని ఆయన ప్రశంసించారు. ఈ చర్య దేశంలోని సంపన్న కుటుంబాలకు స్ఫూర్తినిస్తుందని, పెళ్లిళ్ల పేరిట జరిగే అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వేడుకకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, దుర్గాదాస్ ఉయికే, అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 
Mohan Yadav
Madhya Pradesh
mass wedding
Abhimanyu Yadav
Ishita
Ramdev Baba
Ujjain
social responsibility
wedding ceremony

More Telugu News