Revanth Reddy: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్.. సీఎం రేవంత్ భారీ సన్నాహాలు!

Revanth Reddy Plans Big for Telangana Global Summit Modi Rahul Invited
  • 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
  • ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ప్రభుత్వ ఆహ్వానం
  • సదస్సులో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
  • క్యూర్, ప్యూర్ జోన్లతో రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
  • జాతీయ నేతలను స్వయంగా కలిసి ఆహ్వానించనున్న  రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు.

ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఈ కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన 4,500 మందికి ఆహ్వానాలు పంపగా, 1,000 మంది తమ రాకను ధ్రువీకరించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

ఈ సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. గడిచిన అనుభవాలను పాఠాలుగా తీసుకుని, భవిష్యత్ తరాల కోసం ఈ దార్శనిక పత్రాన్ని సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నీతి ఆయోగ్, ఐఎస్‌బీ వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు.

రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు 'కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ' (CURE)ని ప్రోత్సహించనుంది. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డు బయట ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు పరిధిని 'పెరి అర్బన్ రీజియన్ ఎకనామిక్' (PURE) జోన్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ, గ్రీన్‌ఫీల్డ్ హైవే, బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.
Revanth Reddy
Telangana Global Summit
Narendra Modi
Rahul Gandhi
Telangana Rising 2047
Hyderabad
Bharat Future City
Telangana development
Revanth Reddy government
Telangana economy

More Telugu News